One Nation – One Election : 2027 కాదు.. 2029 కాదు.. 2034లోనే జమిలి ఎన్నికలు..!?

దేశవ్యాప్తంగా ఇప్పుడు జమిలి ఎన్నికల (duel elections) చర్చ నడుస్తోంది. వీలైనంత త్వరగా జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ (BJP) ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ కూడా ఈ జమిలి ఎన్నికలపై చూపిస్తున్న ఉత్సాహం దీనికి ఊతమిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు నిర్వహించడం అంత సులువు కాదని అర్థమవుతోంది. లోక్ సభకు (Lok Sabha), అసెంబ్లీలకు (assembly) ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే అందుకు కావాల్సిన సన్నద్ధతను సమకూర్చుకోవడానికి ఎన్నికల సంఘానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి 2034 వరకూ జమిలి ఎన్నికలు జరిగే అవకాశమే లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్రపతి (President) అప్పాయింటెడ్ డే అని ప్రకటిస్తారు. ప్రస్తుతం 18వ లోక్ సభ నడుస్తోంది. కాబట్టి ఈ రోజు నుంచి 18 లోక్ సభ అమల్లోకి వచ్చిందని వెల్లడించిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇది 2024 వరకూ అమల్లో ఉంటుంది. అలాగే 2024లో ఎన్నికలు జరిగే సమయానికి జమిలి ఎన్నికలపైన అన్ని ఆటంకాలు తొలగించుకోగలగితేనే తదుపరి 2034 నుంచి జమిలి ఎన్నిక ప్రభుత్వాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు అప్పాయింటెడ్ డేట్ (Appointed Date) ని రాష్ట్రపతి 2024 ఎన్నికల తర్వాత ప్రకటించే అవకాశం ఉంటుందనేది న్యాయ నిపుణులు ఇప్పుడు చెప్తున్న మాట. కాబట్టి ఇప్పట్లో జమిలి ఎన్నికలు ఉండబోవని అర్థమవుతోంది.
ఈ విషయాన్ని పక్కనపెడితే జమిలి ఎన్నికలకు అన్ని రాష్ట్రాలు, దేశం సన్నద్ధం కావాలంటే అందుకు అనేక అవసరాలుంటాయి. ఉదాహరణకు ఈవీఎంలు. ప్రస్తుతమున్న ఈవీఎంలు (EVM) అన్ని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు సరిపోవు. కొత్తగా లక్షలాది ఈవీఎంలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్నవాటికి కనీసం మూడింతల ఈవీఎంలు అవసరమవుతాయనేది అంచనా. వీటిని BEL, ECIL ప్రభుత్వరంగ సంస్థలు తయారు చేస్తున్నాయి ఇన్ని ఈవీఎంలను ఇవి తయారుచేయాలంటే కనీసం 2-3 ఏళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలను కూడా దశలవారీగా నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అలాంటిది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. భద్రతాబలగాలు భారీగా అవసరమవుతాయి. రక్షణపరంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మానవ వనరులను కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల బిల్లు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మాత్రమే ఉద్దేశేంచినది. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) ప్రస్తావన లేదు. ఈ బిల్లులను 16న పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది మోదీ ప్రభుత్వం. ఇవి ఆమోదం పొందడం కూడా అంత ఆషామాషీ కాదు. రాజ్యాంగసవరణలు అవసరం. ఇందుకు లోక్ సభలో కనీసం 360 మంది సభ్యుల బలం అవసరం. కానీ ఇప్పుడు ఎన్డీయే (NDA) బలం 294 మాత్రమే. కాబట్టి విపక్షాల (Opposition parties) మద్దతు కూడా కచ్చితంగా అవసరం. అందుకే ఈ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు కనీసం కొన్ని విపక్ష పార్టీలను కన్విన్స్ చేయవచ్చని ఆశిస్తోంది. ఇందుకు నెలో, రెండు నెలలో సరిపోకపోవచ్చు. సంవత్సరాల సమయం పట్టొచ్చు.
ఇంకో ముఖ్యమైన విషయం నియోజకవర్గాల పునర్విభజన (Delimitation). 2021లో జరగాల్సిన జనగణన ఇంతవరకూ పూర్తి కాలేదు. వచ్చే ఏడాది జనగణన (cencus) చేపట్టేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాబట్టి అది పూర్తయిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అవకాశం ఉంది. ఇది పూర్తవడానికి 2027 లేదంటే 2028 వరకూ సమయం పట్టొచ్చని అంచనా. కాబట్టి 2029 వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలి ఎన్నికలు జరిగే అవకాశమే లేదు. ఒకవేళ అప్పుడు నిర్వహించాలనుకున్నా రాజ్యాంగసవరణలు కచ్చితంగా అవసరం. ఇందుకు విపక్షాల మద్దతు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విపక్షాలు మద్దతిస్తాయని ఆశించలేం. కాబట్టి 2029లో కూడా కష్టమే. 2034 నాటికి బీజేపీ అన్నీ సెట్ రైట్ చేసుకోవచ్చనే టాక్ నడుస్తోంది.