ISRO: సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా భారత్ తొలి అడుగు..

DOCKING: డాకింగ్ సామర్థ్యం సంతరించుకోనున్న భారత్…
రోదసిలో రెండు వేర్వేరు వ్యోమనౌకలు అనుసంధానం కావడాన్ని డాకింగ్ అంటారు. ఇది సాంకేతికంగా చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. పరిమిత మానవ ప్రమేయంతో దీన్ని నిర్వహించాల్సి ఉంటుంది. గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యోమనౌకలు.. వేగాన్ని నియంత్రించుకుంటూ పరస్పరం చేరువవుతూ, కమ్యూనికేషన్ సాగించుకుంటూ సున్నితంగా అనుసంధానం కావాలి. ఏ మాత్రం తేడా వచ్చినా పరస్పరం ఢీకొని విచ్ఛిన్నమైపోతాయి.
రోదసిలో అంతరిక్ష కేంద్రం వంటి భారీ నిర్మాణాలకు అవసరమైన ఆకృతులను ఒకేసారి రాకెట్‌లో తరలించడం కష్టం. దఫదఫాలుగా విడిభాగాలను కక్ష్యలోకి చేర్చి.. డాకింగ్ ద్వారా అనుసంధానం చేయాలి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్నీ (ISS) ఇలాగే నిర్మించారు. ఈ కేంద్రాలకు వ్యోమగాములు, సరకులను తరలించే వ్యోమనౌకలు కూడా డాకింగ్ ద్వారా ఆ స్టేషన్‌తో అనుసంధానం కావాల్సిందే. భారత్ కూడా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతోంది. స్పేడెక్స్(spadex) ప్రయోగం.. ఈ దిశగా తొలి అడుగు కానుంది.
రోదసిలో భిన్న వ్యోమనౌకల మధ్య వ్యోమగాములు, సరకులను మార్పిడి చేసుకోవడానికీ డాకింగ్(docking) పరిజ్ఞానం వీలు కల్పిస్తుంది. భారత్ చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’కు(Gaganyaan) ఇది ఉపయోగపడుతుంది. చంద్రయాన్-4 ద్వారా చందమామ ఉపరితలం నుంచి నమూనాలను భూమికి తీసుకురావాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకోసం రెండు రాకెట్ల ద్వారా భిన్న మాడ్యూళ్లను రోదసిలోకి పంపనుంది. వీటిని దశలవారీగా భూ, చందమామ కక్ష్యల్లో డాకింగ్ చేయాల్సి ఉంటుంది.
కక్ష్యలోని ఉపగ్రహాలకు మరమ్మతులు, ఇంధనం నింపడం, ఆధునికీకరణకు ఈ డాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆ శాటిలైట్ల జీవితకాలం పెరుగుతుంది.
ప్రయోగం ఇలా!
స్పేడెక్స్ ప్రాజెక్టు కింద ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలను సోమవారం విడివిడిగా ప్రయోగిస్తారు. ఒకే వాహకనౌక (పీఎస్‌ఎల్‌వీ-సి60)లో ఇవి పయనమవుతాయి. నేలకు 470 కిలోమీటర్ల దూరంలోని వృత్తాకార కక్ష్యలో వాటిని విడివిడిగా ప్రవేశపెడతారు. రెండు ఉపగ్రహాల మధ్య వేగం పరంగా కొంత వైరుధ్యం ఉండేలా చూస్తారు. ఫలితంగా కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు రెండింటి మధ్య దూరం పెరగడం మొదలవుతుంది.రెండు ఉపగ్రహాల్లోనూ డాకింగ్ యంత్రాంగం ఒకేలా ఉంటుంది. అందువల్ల టార్గెట్‌గా, ఛేజర్‌గా దేన్నైనా నిర్ణయించుకోవచ్చు. రెండు శాటిలైట్ల మధ్య దూరం 20 కిలోమీటర్లకు చేరుకున్నాక.. వాటి మధ్య డ్రిఫ్ట్ ఆగిపోయేలా చూస్తారు. ఇందుకోసం రెండు ఉపగ్రహాల్లోని రాకెట్లను సమయానుకూలంగా మండిస్తారు.
డాకింగ్ అనంతరం రెండు ఉపగ్రహాల మధ్య విద్యుత్‌ను శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా బట్వాడా చేసి చూస్తారు. అంతరిక్ష రోబోటిక్స్ తదితర భవిష్యత్ అవసరాలకు ఈ సామర్థ్యం అవసరం. డాకింగ్‌కు సంబంధించిన ప్రయోగాలు పూర్తయ్యాక రెండు ఉపగ్రహాలు విడిపోతాయి. దీన్ని అన్‌డాకింగ్‌గా పేర్కొంటారు. ఆ తర్వాత అవి సాధారణ ఉపగ్రహాల్లా వేర్వేరుగా అంతరిక్ష పరిశీలనలు చేపడతాయి. వాటిలోని హై రిజల్యూషన్ కెమెరా భూ పరిశీలనలకు ఉపయోగపడుతుంది. మినియేచర్ మల్టీ స్పెక్ట్రల్ పేలోడ్ అనే మరో సాధనం సహజ వనరుల పర్యవేక్షణ, పచ్చదనంపై అధ్యయనాలను చేపడుతుంది. రేడియేషన్ మానిటర్ పేలోడ్ అనే సాధనం రోదసిలో ఎదురయ్యే రేడియోధార్మికతను కొలుస్తుంది. భవిష్యత్‌లో మానవసహిత అంతరిక్షయాత్రలకు దీని డేటా ఉపయోగపడుతుంది.