Jai bheem: విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే శక్తి జైబీమ్ కే ఉందా…?

INDIA: విపక్ష ఇండియా కూటమి.. గత ఎన్నికల్లో కుదేలైంది. మహారాష్ట్ర ఎన్నికల్లో అయితే అత్యంత పేలవమైన ప్రదర్శన చేసింది. దీంతో కూటమిలోని పార్టీల్లో విభేదాలు బట్టబయలయ్యాయి. అసలు కూటమికి సారథ్యం వహించే నేర్పు, ఓర్పు, పరిపక్వత కాంగ్రెస్ హైకమాండ్ కు లేదంటూ మిత్రపక్షాలు ఫైరయ్యాయి కూడా. దీనికి తోడు కావాలంటే నేనున్నా.. నేను ముందుకు తీసుకెళ్తానంటూ తృణమూల్ సారథి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(MAMATHA)… ఓ ఆఫర్ చేశారు. అయితే దీన్ని కాంగ్రెస్ తోసిపుచ్చింది.
ఇక పార్లమెంటులో ఆరంభంలో కూడా ఎవరి వాదనలు వారే వినిపించారు. కూటమిగా కదులుతారని ఆశించిన వారికి నిరాశే మిగిల్చారు. అదానీ అవినీతి అంశాన్ని కాంగ్రెస్ ప్రస్తావిస్తే.. సంభల్ ఘటనను ఎస్పీ ప్రస్తావించింది. ఇక తృణమూల్ సహా మిగిలిన పక్షాలు.. తమ సమస్యలను సభ దృష్టికి తెచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో విపక్ష ఐక్యత ఎండమావిగానే కనిపించింది. అయితే జమిలి బిల్ కాస్తా వారిని ఓ దగ్గరకు తెచ్చింది. జమిలిపై అందరూ తమ వ్యతిరేకత వ్యక్తపరిచారు కూడా.
లేటెస్టుగా అంబేడ్కర్ పై అమిత్ షా(AMITH SHAH) చేశారంటున్న వ్యాఖ్యలు.. విపక్షాలను ఐక్యం చేసిందని చెప్పొచ్చు. కలిసికట్టుగా నిరసన చేయడంతో పాటు పార్లమెంటు ఆవరణలో ర్యాలీ తీశారు కూడా. అంతేకాదు.. తామందరూ జైభీమ్ అడుగుజాడల్లో నడుస్తామంటూ గట్టిగానే ప్రకటించారు. తమ దేముడు జై భీమ్ అంటూ సగర్వంగానే ప్రకటించారు. అమిత్ షా సారీ చెప్పాలని.. కేంద్ర హోంమంత్రిని ప్రధాని మోడీ .. పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే డిమాండ్ చేశారు.
అయితే మిగిలిన అంశాల్లో కానరాని విపక్ష ఐక్యత.. ఒక్క జై భీమ్ విషయంలోనే సాధ్యమైంది. ఎందుకంటే..దేశంలోని దళితులు, వెనకబడిన వర్గాలకు ఐకాన్ గా అంబేడ్కర్ మారారు. దీంతో వారందరి ఓట్లు పార్టీలకు ప్రాధాన్యంగా మారాయి. ఈ పరిణామంతో ఎక్కడ తమ ప్రాధాన్యత తగ్గుతుందో అన్న భయం కూడా ఈ అంశానికి ఇంత ప్రాధాన్యత తేవడంలో కీలకంగా మారిందని చెప్పొచ్చు. అయితే.. బీజేపీ కూడా తాము అంబేడ్కర్ ను ఎప్పుడూ అగౌరవపరచలేదని.. ప్రకటించింది. అంటే.. తమకు ఆ ఓట్లు పెద్దసంఖ్యలో దక్కకున్నా..వ్యతిరేకతను మాత్రం కొనితెచ్చుకునేందుకు సిద్ధంగా లేదు. దీంతో ఇదే అస్త్రాన్ని ఎన్డీఏ కూటమిపైకి సంధించాయి. దీన్ని నిలువరించేందుకు బీజేపీ శాయసక్తులా ప్రయత్నిస్తోంది.