Bihar: బిహార్ ఎన్నికల సంగ్రామం.. ఈసీ వర్సెస్ ఇండియా కూటమి..!

ఇప్పటికే ఈసీ టార్గెట్ గా కాంగ్రెస్ (Congress) ఆరోపణలు గుప్పిస్తోంది. ఆపార్టీ నేతలు ఈసీని .. ప్రధాని మోడీ ఏజెంటుగా అభివర్ణిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఆరోపణలకు ఈసీ గట్టిగానే బదులిస్తోంది. అస్సలు ఎలాంటి తప్పు జరగలేదని.. పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నామని స్పష్టం చేస్తోంది. ఈసీ ఎంతగా చెబుతున్నా కాంగ్రెస్ నేతలు.. ముఖ్యంగా ఇండియా కూటమి నేతలు నమ్మడం లేదు. బీజేపీ గెలుపు కోసమే ఈసీ ప్రయత్నిస్తోందని గట్టిగా వాదిస్తున్నారు.
లేటెస్టుగా బిహార్ విపక్షనేత, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ (Tejaswi Yadav) ఈసీని టార్గెట్ చేశారు. ఇటీవలే ..బిహార్ లో చేపట్టిన సమగ్ర ఓటర్ల సర్వేకు సంబంధించి ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో తన పేరును తీసేశారని ఆరోపించారు. ఫొటో గుర్తింపు కార్డులో ఉన్న ఎపిక్ నెంబర్‌ను ఎన్నికల సంఘం అధికారిక యాప్‌లో నమోదు చేసిన తేజస్వి.. జాబితాలో తన ఓటుకు సంబంధించిన వివరాలు తీసేశారని పేర్కొన్నారు. ‘ఎలాంటి రికార్డులు లేవు.’ అని ఉన్న సందేశాన్ని చూపించారు. ‘‘జాబితాలో నా పేరు లేదు. ఎన్నికల్లో నేనెలా పోటీ చేయగలను?.’’ అని ప్రశ్నించారు.
తేజస్వి ఆరోపణలపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. ఎలక్టోరల్ జాబితాలోని ఓ కాపీని సోషల్ మీడియాలో పోస్టు చేసి.. పట్నాలోని వెటర్నరీ కాలేజీ పోలింగ్ బూత్ పరిధిలో తేజస్వికి ఓటు హక్కు ఉందని స్పష్టం చేసింది. ఆయన చేసిన ఆరోపణలు దుర్మార్గపూరితమైనవని, నిరాధారమని దుయ్యబట్టింది. ముసాయిదా ఓటర్ల జాబితాలో సీరియల్ నెంబరు 416లో తేజస్వి పేరు, వివరాలు ఉన్నాయని వివరించింది.