Delhi: ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ ఆరోపణల పర్వం.. అంతా అబద్దమంటున్న ఈసీ, బీజేపీ

లోక్‌సభ ఎన్నికల్లో ‘ఓట్ల దొంగతనం’ జరిగిందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలు.. దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీంతో దేశంలోని ప్రతీపార్టీ, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇప్పుడు దీనిపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమో.. ఈ ప్రభావంతో తర్వాతి ఎన్నికల్లో తామెక్కడ ఓడిపోతామో అన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే ఇండియా కూటమి నేతలు, పార్టీలు.. రాహుల్ ఆరోపణలకు మద్దతిస్తున్నాయి. తమ ఓటమికి కూడా ఇదే కారణమని ఆరోపిస్తున్నాయి.
దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఎక్కడికక్కడ ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. బెంగుళూరులో సైతం ఇదే చెబుతున్నారు రాహుల్. ఈఅంశం తమ ప్రతిష్టకు భంగం కలిగించేదిగా మారడంతో.. ఈసీ రంగంలోకి దిగింది.రాహుల్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, ఆయన తన ఆరోపణలపై నమ్మకం ఉంటే ప్రమాణపూర్వకంగా ఫిర్యాదు చేయాలని గురువారం స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఫ్యాక్ట్ చెక్’ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది.
“మీరు చెప్పేది నిజమే అయితే, సాయంత్రంలోగా కర్ణాటక ఎన్నికల అధికారికి ప్రమాణ స్వీకార పత్రం సమర్పించాలి. తద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఒకవేళ మీ ఆరోపణలపై మీకే నమ్మకం లేకపోతే, అర్థరహితమైన అభిప్రాయాలకు రావడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలి” అని ఈసీ రాహుల్‌కు హితవు పలికింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని బెంగళూరు (Bangalore) సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో భారీ ఎత్తున ఎన్నికల మోసం జరిగిందని రాహుల్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. బెంగళూరు సెంట్రల్‌లో బీజేపీకి 32,707 ఓట్ల ఆధిక్యం రాగా, ఒక్క మహదేవపురలోనే ఆ పార్టీకి 1,14,046 ఓట్ల భారీ ఆధిక్యం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ ఒక్క సెగ్మెంట్‌లోనే దాదాపు 1,00,250 ఓట్లను దొంగిలించారని, బీజేపీతో కుమ్మక్కై ఈసీయే ఈ మోసానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. డూప్లికేట్ ఓటర్లు, ఇతర రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నవారి పేర్లను ఆయన ఉదహరించారు.
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రం ఆగ్రహం
రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. రాహుల్, ఆయన బృందం చేస్తున్న వాదనలు నిరాధారమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని విమర్శించారు. ఎన్నికల సంఘం ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు అనుకూలంగా తీర్పులు రానప్పుడు సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలను కించపరచడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆయన అన్నారు.