Congress: బీజేపీ ట్రాప్‌లో పడిన కాంగ్రెస్..! అదానీ అంశం మాయం..!?

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్డీయే (NDA), ఇండియా (I.N.D.I.A.) కూటమి మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. బీజేపీకి (BJP) ఒంటరిగా మెజారిటీ రాకపోవడంతో మోదీ (Modi) ప్రభుత్వం కచ్చితంగా మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. అదే సమయంలో ఇండియా కూటమికి అనుకున్నదాని కంటే ఎక్కువ సీట్లు రావడంతో కాస్త జోష్ కనిపిస్తోంది. అందుకే బీజేపీ సర్కార్ ను ముప్పతిప్పలు పెట్టేందుకు తమ ముందున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ వస్తోంది. అయితే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో (Parliament Sessions) ఇండియా కూటమి బీజేపీ ట్రాప్ లో పడిందేమోననే అనుమానాలు తలెత్తుతున్నాయి.
మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదానీ అంశాన్ని కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రధాన అజెండాగా ఎంచుకుంది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ అంశాన్ని పార్లమెంటులో పదేపదే లేవనెత్తుతున్నారు. గతంలో హిండెన్ బర్గ్ (Hindenberg ) రిపోర్టులు బయటికొచ్చినప్పుడు అదానీ అంశాన్ని కాంగ్రెస్ పెద్ద ఎత్తున వాడుకుంది. దానిపై చర్చకోసం పట్టుబట్టింది. అయితే అందుకు మోదీ సర్కార్ ముందుకు రాలేదు. ఇప్పుడు అమెరికాలో అదానీపై (Adani) కేసు నమోదైంది. తాము ముందు నుంచి ఇదే విషయం చెప్తున్నామని.. అక్రమ మార్గంలో అదానీ ఎదుగుతున్నారని కాంగ్రెస్ చెప్తోంది. అందుకే అదానీ అంశంపై కచ్చితంగా చర్చించాల్సిందేనని కాంగ్రెస్ మొదటి రోజు నుంచి డిమాండ్ చేస్తూ వస్తోంది.
అదానీ అంశంపై చర్చకోసం మొదటి రోజు నుంచి కాంగ్రెస్ పట్టుబడుతోంది. దీంతో చట్టసభల్లో చర్చలు సాగట్లేదు. ప్రతిరోజూ సభలు వాయిదా పడుతూనే ఉన్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ వెనక్కు తగ్గకపోవడంతో సభలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో అదానీ అంశంపై కాంగ్రెస్ పట్టువీడేలా లేదని అర్థమైంది. అయితే ఇక్కడే బీజేపీ తన అజెండా అమలు చేసినట్లు అర్థమవుతోంది. కొన్ని కీలక బిల్లులను ఆమోదించుకోవాలనే ఉద్దేశంతో జమిలి ఎన్నికల బిల్లును (One nation one election bill) తెరపైకి తెచ్చింది. దీన్ని సభలో ప్రవేశ పెట్టింది. దీంతో అదానీ అంశాన్ని వదిలేసిన ఇండియా కూటమి.. జమిలి బిల్లును అడ్డుకుంది. ఓటింగ్ కోసం పట్టుబట్టింది. చివరకు జేపీసీకి పంపేందుకు మోదీ సర్కార్ అంగీకరించింది. ఇదంతా జరుగుతుందని బీజేపీ ఊహించిందే. ఆ పార్టీ అనుకున్నట్టే జరిగింది.
జమిలి ఎన్నికల బిల్లు హడావుడి కొనసాగుతున్న సమయంలోనే రాజ్యసభలో (Rajyasabha) అమిత్ షా (Amit Shah) అంబేద్కర్ (Ambedkar) ను అవమానించేలా మాట్లాడారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకే అమిత్ షా రాజీనామా చేయాలనే డిమాండ్ తో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నిరసనల్లో తోపులాట జరగడం.. బీజేపీ ఎంపీలు గాయపడడం.. వాళ్లను ఆసుపత్రిలో చేర్చడం.. ఇందుకు కారణమైన రాహుల్ గాంధీపై కేసు నమోదు కావడం.. చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు అదానీ అంశం మరుగున పడిపోయింది.. జమిలి జేపీసీకి వెళ్లిపోయింది.. అంబేద్కర్ వ్యవహారం పక్కకెళ్లి రాహుల్ గాంధీపై కేసు తెరపైకి వచ్చింది. ఇలా బీజేపీ ట్రాప్ లో కాంగ్రెస్ పార్టీ పడ్డట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మొదటి నుంచి అదానీ ఇష్యూకు కట్టుబడి దానిపై చర్చకు పట్టుబడి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి బాగుండేదేమో..!