BJP: సౌత్ పై కమలం ఫోకస్, కిషన్ రెడ్డికి కీలక పదవి

దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ (BJP) బలపడేందుకు తీవ్ర స్థాయిలో కష్టాలు పడుతోంది. 2024 లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా… ఎన్డియే పక్షాలతో కలిసి అధికారం కైవసం చేసుకుంది. అయితే భవిష్యత్తులో ఇబ్బందికర పరిణామాలు కాస్త బిజెపికి ఉత్తరాదిలో కనపడుతున్నాయి. 2029లో జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఈ లోపే జమిలి ఎన్నికలు నిర్వహించి మళ్లీ అధికారంలోకి రావాలని బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది కమలం పార్టీ. అందుకే దక్షిణాది రాష్ట్రాల నాయకులకు కీలక పదవులు అప్పగించే విధంగా ఆ పార్టీ అగ్ర నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆ పార్టీలో ఉత్తరాది రాష్ట్రాల నాయకుల పెత్తనం ఎక్కువగా కనపడింది. వెంకయ్య నాయుడు తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపికి ఆ స్థాయిలో బలమైన నాయకుడు కనపడలేదు. ఒక కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ క్రమంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో తెలంగాణ నుంచి బిజెపి జాతియ అధ్యక్షుడుని ఎంపిక చేసే విధంగా ప్రణాళికలో సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని (Kishan reddy) బిజెపి జాతియ అధ్యక్ష పదవికి ఎంపిక చేసే ఆలోచనలో బిజెపి అగ్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణలో అత్యంత కీలకంగా ఉన్నారు. అందుకే ఆయనకు నేరుగా కేంద్ర మంత్రివర్గంలో పదవి అప్పగించారు. గతంలో సహాయ మంత్రి పదవి ఉన్నా ఇప్పుడు మాత్రం నేరుగా క్యాబినెట్లోకి తీసుకున్నారు. దీని ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బిజెపి ప్రయత్నాలు మొదలుపెడుతోంది. అటు తెలంగాణ బిజెపి నాయకులు కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ముందు కర్ణాటకకు చెందిన నాయకుడిని జాతీయ అధ్యక్షుడుగా నియమించాలని భావించారు. కానీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణను టార్గెట్ గా పెట్టుకోవడంతో కిషన్ రెడ్డిని నియమిస్తే కచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని బిజెపి అంచనా వేస్తోంది. ఇక అటు కాంగ్రెస్ పార్టీ కూడా దక్షిణాదికి చెందిన వ్యక్తినే తమ పార్టీ అధ్యక్షుడుగా నియమించింది. మరి ఈ వ్యూహాలు ఆ పార్టీకి ఎంతవరకు కలిసి వస్తాయో చూడాలి.