Rahul Gandhi: కాంగ్రెస్ టార్గెట్ గా ఈసీ..? మోడీ సర్కార్ ను గెలిపిస్తోంది ఈ సంస్థే అంటున్న రాహుల్..

వరుసగా ఎన్నికల్లో పరాజయాలకు కారణాలను అన్వేషిస్తున్న రాహుల్ గాంధీ.. ఓ ఆటంబాంబు లాంటి అంశాన్ని కనుగొన్నారు. అదే విషయాన్ని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. అది ఏంటంటే.. ఎన్నికల కమిషన్ మోడీ ఏజెంటుగా మారిందన్నది రాహుల్ ఆరోపణలు. అంతే కాదు.. దీనికి సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అంతే కాదు.. దేశంలో ఏకంగా ఎన్నికల కమిషన్ చచ్చిపోయిందని ఘాటుగా ఆరోపించారు రాహుల్..
2024 లోక్‌సభ ఎన్నికలు రిగ్గింగ్‌కు గురయ్యాయంటూ మరోసారి ఆరోపణలు సంధించారు రాహుల్. ఇన్నాళ్లూ ఆధారాల్లేక ఆగామని, ఇప్పుడు అణు బాంబులాంటి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, త్వరలోనే బహిర్గతం చేస్తామని తెలిపారు. గత ఎన్నికల్లో కనీసం 10-15 లోక్‌సభ స్థానాల్లో రిగ్గింగ్ జరగకపోయినా నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యేవారు కాదన్నారు. 70 నుంచి 100 నియోజకవర్గాల్లో అక్రమాలు జరిగాయని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ ప్రభుత్వం స్వల్ప ఆధిక్యంతో కొనసాగుతోందన్నారు.
లోక్‌సభ ఎన్నికలను ఎలా రిగ్గింగ్ చేయొచ్చో, ఎలా చేశారోననే అంశాలకు సంబంధించిన ఆధారాలను అతిత్వరలో బయటపెట్టబోతున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. 100% ఆధారాలతో ఈ విషయం చెబుతున్నానని స్పష్టం చేశారు. తాను ఇచ్చిన ఆధారాలను చూసిన వాళ్లు కుర్చీల్లోంచి కిందపడుతున్నారని, ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. కర్ణాటకలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ సేకరించిన సమాచారాన్ని విశ్లేషించగా మొత్తం 6.5లక్షల ఓటర్లలో 1.5లక్షల మంది నకిలీ ఓటర్లని తేలిందన్నారు. ఓటర్ల ప్రతి పేరును, ప్రతి ఫొటోనూ పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చామన్నారు
ఈసీ ఖండన
2024 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణను ఎన్నికల సంఘం ఇప్పటికే తోసిపుచ్చింది. ఎన్నికల యంత్రాంగంపై ఒత్తిడి తేవడానికి, ఎన్నికల అధికారులను బెదిరించేందుకే ఈ నిరాధార ఆరోపణలు చేసినట్టు కనిపిస్తోందని కమిషన్ పేర్కొంది. నాడు ఎన్నికలకు ముందు ప్రజా ప్రాతినిధ్య చట్టం మేరకు ముసాయిదా ఎన్నికల జాబితాను, తుది జాబితాను కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలతో పంచుకున్నామని తెలిపింది. ఓటర్ల జాబితాపై దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడా కాంగ్రెస్ అప్పీళ్లు దాఖలు చేయలేదు, అని కమిషన్ పేర్కొంది.