Amit Shah: పాకిస్తాన్ కు చిదంబరం క్లీన్ చిట్ ఇచ్చారా..?

మంగళవారం పార్లమెంటు వర్షాకాల(Monsoon Session of Parliament) సమావేశాల సందర్భంగా లోక్‌సభలో పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. విపక్షాలు ఈ విషయంలో కేంద్రాన్ని ఇరుకన పెట్టే రాజకీయం చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టే వ్యాఖ్యలు చేసారు అమిత్ షా. సోమవారం ఆపరేషన్ మహాదేవ్ లో హతమైన ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఓటరు గుర్తింపు కార్డులు, చాక్లెట్ రేపర్లు పాకిస్తాన్‌లో తయారు చేసినవని అమిత్ షా వ్యాఖ్యానించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల మూలాల గురించి కాంగ్రెస్ ఎంపీ పి. చిదంబరం అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినవారని నిర్ధారించే ఖచ్చితమైన ఆధారాలను కేంద్రం సేకరించిందని ఆయన స్పష్టం చేసారు. హతమైన ఉగ్రవాదుల వద్ద లభించిన పాకిస్తాన్ పలు ఆధారాలు కూడా ఇందుకు నిదర్శనమన్నారు. ఇక కాంగ్రెస్ పాకిస్తాన్ ను రక్షించే ప్రయత్నం చేస్తుందని అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేసారు.
సోమవారం కాంగ్రెస్ తమను ఓ ప్రశ్న అడిగిందని.. ఉగ్రవాదులు ఎక్కడి నుండి వచ్చారో, దానికి ఎవరు బాధ్యులని అడిగారని.. మేము అధికారంలో ఉన్నందున అది మా బాధ్యతన్న అమిత్ షా.. చిదంబరం పాకిస్తాన్ ను రక్షించే విధంగా కామెంట్స్ చేసారని, పాకిస్తాన్‌ను రక్షిస్తే ఆయనకు ఏం లాభం అని తాను అడగాలనుకుంటున్నాను అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. చిదంబరం వ్యాఖ్యలు చూస్తే ఆయన పాకిస్తాన్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్టు అర్ధమవుతోంది అన్నారు.
కాగా పార్లమెంట్ సమావేశాల తర్వాత చిదంబరం చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. జూలై 27న ది క్వింట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఉగ్రవాదులు స్వదేశీ కావొచ్చు అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ కు ఉగ్రవాదులకు ఉన్న లింక్ లను చూపాలని కోరారు. ఆపరేషన్ సిందూర్ పై పారదర్శకత లోపించిందని కేంద్రాన్ని విమర్శించారు. ఉగ్రవాద దాడి చేసినవారు ఎక్కడ ఉన్నారు? మీరు వారిని ఎందుకు పట్టుకోలేదు? మీరు వారిని ఎందుకు గుర్తించలేదు? అకస్మాత్తుగా, వారికి ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులను మేము అరెస్టు చేశామని ఒక వార్త వచ్చిందని, ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు.