Islamabad: యుద్ధానికి దిగి తప్పు చేశామా..? కాళ్ల బేరానికి పాక్ సర్కార్…!

యుద్ధానికి సిద్ధమంటూ బింకాలు పలికిన పాకిస్తాన్ (Pakistan) సైన్యం పరిస్థితి కేవలం మూడంటే మూడురోజుల్లో ప్రపంచానికి అర్థమైపోయింది. భారత్ ముందు పాకిస్తాన్ అస్త్రాలు విఫలమవుతుండడం… ఆదేశ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ప్రపంచదేశాలు సైతం భారత్ అస్త్ర సామర్థ్యాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఎన్ని డ్రోన్లు, ఎన్ని మిస్సైల్స్ పంపినా.. భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటన్నింటినీ గాల్లోనే పేల్చేస్తున్నాయి. మరోవైపు భారత్ గురిపెట్టి.. పాక్ కీలక రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. దీంతో యుద్ధం కొనసాగితే తాము మరింత నష్టపోక తప్పదని పాక్ రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
భారత్ తమపై దాడి చేస్తే ఎదురుదాడికి దిగుతామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాక్ ఇప్పుడు మాట మార్చేసింది. పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) మీడియాతో మాట్లాడుతూ.. భారత్ తమపై చేస్తున్న సైనిక దాడిని ఇక్కడితో ఆపితే తాము కూడా ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇరుదేశాల మధ్య దాడుల వల్ల పాక్ ఆర్థిక పరిస్థితి కుదేలవ్వడం, ప్రజల పరిస్థితులు అధ్వానంగా మారే ప్రమాదం ఉండడంతో.. ఈ యుద్ధ వాతావరణాన్ని రూపుమాపడం కోసం న్యూఢిల్లీతో చర్చలు జరపడానికి ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని పాక్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితులు చేయి దాటకముందే దాడుల నివారణకు చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco rubio) ఇరుదేశాలకు సూచించారు. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగశాఖ మంత్రి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.అన్ని దేశాలు యుద్ధం విరమించుకోవాలని భారత్, పాక్ లకు సూచిస్తున్నాయి కానీ.. ఏ దేశం కూడా నేరుగా మధ్యవర్తిత్వానికి రాకపోవడం సైతం పాకిస్తాన్ ను ఆలోచనలో పడేసింది. ఇంత మద్దతుగా ఉన్న చైనా శాంతిమంత్రం జపిస్తోంది కానీ.. నేరుగా సీన్ లోకి రావడం లేదు.
ఇక అరబ్ ప్రపంచం సైతం .. అయితే భారత్ కు మద్దతుగా ఉంటోంది. లేదంటే ఈ అంశానికి వీలైనంత దూరంగా నిలుస్తోంది. ఈవ్యవహారం సైతం పాక్ ను షాక్ కు గురిచేస్తోంది. ఎందుకంటే భారత్ ఎక్కడా పౌరసమాజంపై దాడులు చేయడం లేదు. అదీకాక.. ఉగ్రవాద తండాలు, గ్రూపుల స్థావరాలను జల్లెడ పట్టి మరీ దాడులు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలను సైతం ప్రపంచానికి ఎప్పటికప్పుడు అందిస్తోంది. ఈదశలో ఆయాదేశాలు సైతం ఏమి మాట్లాడతాయి అన్నది అంతర్జాతీయ నిపుణుల భావన.