USA: ఓవైపు పుతిన్ తో చర్చలు..మరోవైపు భారత్ కు హెచ్చరికలు.. ఇదీ అమెరికా స్టైల్..

పుతిన్ (Putin) తో మా అధ్యక్షుడి చర్చలు ఫలించక పోతే… భారత్ పై మరింతగా సుంకాల మోత మోగిస్తాం.. ఇది అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిస్సెంట్ వ్యాఖ్యలు. ఆ రెండు దేశాలు చర్చించుకోవడమేంటి..? అనుకున్న ఫలితం రాకుంటే.. తమపై ఆంక్షలు వేయడమేంటని భారతీయుల్లోనూ చర్చ జరుగుతోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల మోత (US Tariffs on India) మోగించారు. మన దేశం నుంచి చేసుకొనే దిగుమతులపై టారిఫ్‌లను 50 శాతానికి పెంచారు. అయితే, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అలాస్కా వేదికగా నిర్వహించనున్న ట్రంప్- పుతిన్‌ల (Trump-Putin Meet) సమావేశం ఫలితాన్ని బట్టి.. ఈ సుంకాలను మరింత పెంచే అవకాశం ఉందని అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బిస్సెంట్ వ్యాఖ్యానించారు.
‘‘రష్యా (Russia) నుంచి పెద్దఎత్తున చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఇటీవల అదనపు సుంకాలు విధించాం. ఒకవేళ ట్రంప్ (Donald Trump)- పుతిన్ (Vladimir Putin) భేటీ సానుకూల ఫలితాలు ఇవ్వకపోతే.. ఆంక్షలు లేదా టారిఫ్‌లు మరింత పెరగొచ్చని భావిస్తున్నా’’ అని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిస్సెంట్ (Scott Bessent) పేర్కొన్నారు. చైనా (China) సైతం రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న విషయాన్ని ప్రస్తావించగా.. ‘‘ఇది అధ్యక్షుడు ట్రంప్ చేతుల్లోని వ్యవహారం. తన వద్ద అన్ని ఆప్షన్లు ఉన్నాయనే విషయాన్ని పుతిన్‌కు ట్రంప్ స్పష్టం చేయనున్నారు’’ అని సమాధానమిచ్చారు.
అక్టోబర్ చివరి నాటికి ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేయడం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. అమెరికా అదనపు సుంకాలు సహేతుకం కాదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇది ‘అనుచితం, అన్యాయం, అహేతుకం’ అని పేర్కొంది. ఈ వ్యవహారంలో దేశ ప్రయోజనాలకు కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని విదేశీ వ్యవహారాలశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్‌పై తాము విధించిన టారిఫ్‌ల భారం.. రష్యాకు పెద్ద దెబ్బ అని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. అలాస్కాలో శుక్రవారం జరిగే తమ భేటీ తర్వాత పుతిన్ యుద్ధాన్ని ఆపకపోతే అత్యంత తీవ్ర పరిణామాలుంటాయని మరో సందర్భంలో హెచ్చరించారు. ఉక్రెయిన్ తరఫున భూభాగం విషయంలోనే చర్చలుంటాయని స్పష్టం చేశారు.