Washington: నేడు ట్రంప్-పుతిన్ కీలక భేటీ.. యుద్ధ విరమణపై ప్రపంచం ఆశలు

ప్రపంచాన్ని ముందుకు నడిపించే రెండు అతిపెద్ద చోదకశక్తులు.. అగ్రరాజ్యాధినేతలు ట్రంప్-పుతిన్ మధ్య అలస్కా వేదికగా కీలక భేటీ జరగనుంది. ఎన్నో ప్రతిపాదనలు, మరెన్నో చర్చలు.. ఎన్నో మధ్యవర్తిత్వాలు, మరెన్నో రాయభారాల తర్వాత ఈ భేటీ జరగనుంది. ఈభేటీలో రష్యాను ఎలాగైనా ఒప్పించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపి తీరాల్సిందేనని పుతిన్ పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ చర్చల ప్రక్రియపై ప్రపంచం భారీఆశలు, అంచనాలే పెట్టుకుంది.
ట్రంప్ (Donald Trump) తొలి విడత అధ్యక్షుడిగా పని చేసినప్పుడు పుతిన్ (Putin) తో 6సార్లు భేటీ అయ్యారు. 2021లో ట్రంప్ దిగిపోయాకా పుతిన్‌తో స్నేహపూర్వక సంబంధాలనే కొనసాగించారు. 2022లో ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం ప్రారంభించినప్పుడు ట్రంప్ సానుకూలంగా మాట్లాడారు. శాంతిదూతలా పుతిన్ ఉక్రెయిన్‌కు వెళ్లారని ప్రశంసించారు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసేది కాదని తరచూ ట్రంప్ చెబుతూ ఉంటారు. ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతివ్వడంపై… 2024లో తన ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్ విమర్శించారు. తాను అధికారం చేపట్టిన 24 గంటల్లోనే యుద్ధాన్ని ఆపిస్తానని ప్రకటించారు. అధికారం చేపట్టాక ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అప్పట్లో తాను సరదాగా అలా అన్నానని వివరణ ఇచ్చారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనతో భేటీకి పుతిన్ ప్రయత్నిస్తున్నారు. అమెరికా-రష్యా సంయుక్త ప్రాజెక్టుల ద్వారా ఉక్రెయిన్‌కు చెక్ పెట్టాలని భావించారు. దీంతోపాటు అనేక అంశాల్లో సహకారానికి ప్రయత్నించారు. ఫిబ్రవరిలో జెలెన్‌స్కీతో ట్రంప్ భేటీ తర్వాత పరిణామాలు పుతిన్‌కు అనుకూలంగా మారినట్లే కనిపించాయి. మార్చి నెలాఖరులోనూ పుతిన్‌పై ట్రంప్ నమ్మకాన్ని కనబరిచారు. కాల్పుల విరమణపై మాటకు కట్టుబడి ఉంటారని చెప్పారు. కానీ నెల తిరిగేసరికి రష్యా దాడులు పెరగడంతో ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చింది. పుతిన్ వైఖరిపట్ల ఆయనలో అసహనం క్రమంగా పెరుగుతూ వచ్చింది. మే నెలకు వచ్చేసరికి అది మరింత పెరిగి పుతిన్ పిచ్చోడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించే స్థాయికి వెళ్లిపోయింది.
ఈ నెల మొదట్లో రష్యా తీరానికి సమీపంలో రెండు అణు సబ్‌మెరైన్లను మోహరించాలని ట్రంప్ ఆదేశించారు. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదెవ్ రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. పుతిన్‌తో భేటీ ఖరారైన తర్వాత ట్రంప్.. తన వ్యాఖ్యల గాఢతను మరింత పెంచారు. పుతిన్‌తో జరిగే సమావేశం వివాదాన్ని పరిష్కరించేదిగానే కాకుండా భావోద్వేగ సమావేశంగానూ నిలవనుందని వ్యాఖ్యానించారు. మరోవైపు యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయనీ హెచ్చరించారు.