Alaska: అలస్కా చర్చల్లో పుతిన్ సక్సెస్… వ్యూహాత్మకంగా వ్యవహరించిన రష్యా అధినేత

యుద్ధం ఆపకుంటే ఆంక్షలు తప్పవు.. రష్యా ఆర్థిక వ్యవస్థ వెన్నువిరిచేలా చర్యలు చేపడతాం.. ఇదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) గర్జన. దీనిలో భాగంగా అమెరికాకు మిత్రపక్షంగా ఉన్న భారత్ పైనా ఆంక్షలు విధించారు ట్రంప్. రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు.. ఇది గట్టి వార్నింగ్ అన్నారు ట్రంప్. ఈ సమయంలో అందివచ్చిన అలస్కా వేదికను.. రష్యా అధినేత పుతిన్ (Putin) బాగానే వాడుకున్నారని చెప్పక తప్పదు. ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తే.. ఆయన ఆగ్రహానికి గురికాక తప్పదు. అందుకే చర్చల్లో పాల్గొని ట్రంప్ ను కూల్ చేశారు. అయితే చర్చల్లో మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్లు కచ్చితంగా చెప్పేశారు కూడా.
ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమింపజేసే మాట ఎలాఉన్నా తన బలాన్ని, స్వరాన్ని మరింత పెంచుకోవడంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించినట్లు చెబుతున్నారు. చర్చల నిమిత్తం అలాస్కాకు వచ్చిన పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా స్వాగతించడంతోపాటు రెండు దేశాల మధ్య సంబంధాలను కొనియాడారు. రష్యా బలమైన దేశమని, ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. శాంతిస్థాపనకు కాల్పుల విరమణను పాటించాలని చెబుతూవస్తున్న ట్రంప్ ఇప్పుడు దానిని వదిలేసినట్లు ఆయన ప్రకటన చెబుతోంది. దీని బదులు పూర్తిస్థాయి శాంతి ఒప్పందం కుదరడానికే తాను అనుకూలమని ట్రంప్ చెప్పారు. రష్యా చాలాకాలం నుంచి ఇదే చెబుతోంది. యుద్ధం విరమించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ ఇదివరకు రష్యాకు చేసిన బెదిరింపులు ఇప్పుడు వినిపించడం లేదు. ‘హడావుడిగా ఏర్పాటుచేసిన అలాస్కా చర్చలు ట్రంప్‌నకు ఎలాంటి ప్రయోజనం కలిగించలేదు. పుతిన్ మాత్రం తాను కోరుకున్నవాటిలో చాలావరకు పొందగలిగారు’ అని రష్యాలో బ్రిటన్ మాజీ రాయబారి లారీ బ్రిస్టో విశ్లేషించారు.
రష్యాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా అడ్డుకోవడం ప్రధాన లక్ష్యంగా అలాస్కాకు వచ్చిన పుతిన్ ఆ లక్ష్యం నెరవేర్చుకున్నట్లేనని లండన్‌లోని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ అంతర్జాతీయ భద్రత డైరెక్టర్ నీల్ మెల్విన్ చెప్పారు. శాంతిచర్చల తుది దశలో మాత్రమే జెలెన్‌స్కీతో పుతిన్ భేటీ అవుతారని క్రెమ్లిన్ ఎప్పటినుంచో చెబుతోందని, ఇప్పుడు అదే జరగబోతోందని మరో విశ్లేషకుడు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు తన పాత్రను పదిలపరచుకుంటూనే బాధ్యతను ఉక్రెయిన్, యూరప్ లపై నెట్టేసినట్లు కనిపిస్తోందన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య భారీ రియల్ ఎస్టేట్ ఒప్పందానికి మధ్యవర్తిగా ఉండాలని ట్రంప్ అనుకున్నా నిజానికి ఆయన ఉక్రెయిన్‌పై మాత్రమే ఒత్తిడి తీసుకురాగలిగారని సీనియర్ సలహాదారుడు పియోనా హిల్ చెప్పారు. సైనికపరంగా గెలవలేమని పుతిన్ పూర్తిగా భావిస్తే తప్ప యుద్ధం ఆగదని మాజీ రాయబారి బ్రిస్టో అంచనా వేస్తున్నారు.
అమెరికాకు పుతిన్ వెళ్లడం గత పదేళ్లలో ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించాక పాశ్చాత్య దేశానికి వెళ్లడం కూడా ఇదే ప్రథమం. యుద్ధ నేరాభియోగాలపై పుతిన్‌కు 2023లో అంతర్జాతీయ నేర న్యాయస్థానం అరెస్టు వారెంటు జారీచేసింది. దాంతో ఆయన చేపట్టే విదేశీ పర్యటనలు, ప్రపంచ నేతలతో ఒప్పందాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎర్రతివాచీ పరిచి ఆయన్ని ట్రంప్ స్వాగతించడంతోపాటు, ఆ సమయంలో యుద్ధవిమానాలు వారి మీదుగా వెళ్లడం చూస్తుంటే పుతిన్‌ను ట్రంప్ ఒక స్నేహితుడిగా భావిస్తున్నట్లు చెప్పవచ్చని విశ్రాంత కర్నల్ పీర్ డి జోంగ్ చెప్పారు. ‘పుతిన్, లార్డ్ ఆఫ్ వార్’ అనే పుస్తకాన్ని రచించిన ఆయన ఫ్రాన్స్ అధ్యక్షులకు సహాయకునిగా రెండుసార్లు వ్యవహరించారు. అలాస్కాలో పుతిన్‌కు లభించిన స్వాగతాన్ని రష్యా మీడియా ప్రముఖంగా ప్రచురించింది.