Moscow: టు వయా బేరింగ్ జలసంధి .. అలాస్కాకు పుతిన్

ట్రంప్‌తో చర్చల కోసం అలాస్కా వెళ్లనున్న రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్ (Putin) బేరింగ్ జలసంధిపై నుంచి ప్రయాణించే అవకాశముంది. ఇందుకోసం ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. తమ గగనతలంలోకి రష్యా అధినేత విమానం ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చింది. రష్యా మారుమూల ప్రదేశమైన చుకోట్కా ద్వీపకల్పం నుంచి పుతిన్ విమానం రానుంది. బేరింగ్ జలసంధి వద్ద రష్యా, అమెరికా ప్రధాన భూభాగాలు కేవలం 88 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
అలాస్కాకు చెందిన లిటిల్ డైమెడ్, మాస్కోకు చెందిన బిగ్ డైమెడ్ ద్వీపాల మధ్య దూరం కేవలం 3 మైళ్లే. కోల్డ్‌వార్ సమయంలో రష్యా అధినేత మిఖాయిల్ గోర్బచెవ్ ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని ఐస్‌కర్టెన్‌గా అభివర్ణించేది. అలాస్కాలో అమెరికా కమాండ్ సెంటర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, లాజిస్టిక్స్ హబ్స్ ఉన్నాయి. ఉత్తర అమెరికాను ముప్పుల నుంచి హెచ్చరించే ‘ద నార్త్ వార్నింగ్ సిస్టమ్’ ప్రధాన కేంద్రం ఇక్కడే ఉంది. అమెరికా, కెనడాలు సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. ఇక్కడ అత్యాధునిక యుద్ధ విమానాలైన ఎఫ్-22 రాప్టర్లున్నాయి. యాంకరేజ్‌లోని ఎల్మెండోర్ఫ్-రిచర్డ్సన్ సైనిక స్థావరంలో దాదాపు 32వేల మంది ఉన్నారు. దీనిని సందర్శించిన తొలి అధ్యక్షుడిగా పుతిన్ రికార్డు సృష్టించనున్నారు.