Alaska: యుద్ధం విరమించాలంటే పుతిన్ కీలక షరతు.. దొనెట్‌స్క్ ను ఉక్రెయిన్ వదులుకోవాల్సిందే

అలస్కా వేదికగా జరిగిన చర్చల్లో ఏ పురోగతి లేకపోయిన సంగతి అందరికీ తెలిసిందే.. ఇందులో యుద్ద విరమణ కోసం ట్రంప్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ పుతిన్ మాత్రం.. తాను అనుకున్నది, అనుకున్నట్లుగా కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా ఈ యుద్ధాన్ని విరమించాలని కోరుకుంటే కచ్చితంగా దొనెట్‌స్క్ భూభాగాన్ని ఉక్రెయిన్ వదులుకోవాలన్నారు. అలస్కాలో ట్రంప్ ఎదుట పుతిన్ ఈ షరతు ఉంచారు. అయితే దీన్ని ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ తిరస్కరించారు.
యుద్ధం ముగించాలంటే తూర్పున ఉన్న దొనెట్‌స్క్ (Donetsk) ప్రాంతం నుంచి ఉక్రెయుద్యిన్ పూర్తిగా వైదొలగాలని పుతిన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అలాస్కా భేటీ అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy)తో పాటు యూరోపియన్ నేతలతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో పుతిన్ చేసిన ప్రతిపాదనను అగ్రరాజ్యాధిపతి వారికి వివరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
రష్యా సరిహద్దుల వెంబడి తూర్పు ఉక్రెయిన్‌లో డాన్‌బాస్ ప్రాంతం ఉంది. అందులో దొనెట్‌స్క్, లుహాన్‌స్క్‌లు అంతర్భాగాలు. పారిశ్రామిక హబ్‌గా ఉన్న ఈ ప్రాంతంలో మైనింగ్ కూడా ఎక్కువగానే జరుగుతుంది. బొగ్గు నిల్వలు, ఉక్కు ఉత్పత్తులకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం రష్యా ఆధీనంలోనే ఉంది. 2022లోనే ఈ ప్రాంతంలోని అధిక భాగాన్ని మాస్కో తన సొంతం చేసుకుంది. ఇటీవల మాస్కో బలగాలు ఈ ప్రాంతంలోకి మరింతగా చొచ్చుకు వచ్చాయి. కేవలం 30 శాతం దొనెట్‌స్క్ ప్రాంతం మాత్రమే ఉక్రెయిన్ ఆధీనంలో ఉంది. ఇప్పుడు మిగిలిన ఆ ప్రాంతాన్ని కూడా తన వశం చేసుకోవాలని మాస్కో భావిస్తోంది.