Sehbaz Shariff: పాకిస్థాన్ రాకెట్ ఫోర్స్ – టార్గెట్ భారత్ అంటున్న పాక్ ప్రధాని

ఆపరేషన్ సిందూర్.. పాక్ రక్షణ రంగ బలహీనతల్ని ప్రపంచానికి భూతద్దంలో పెట్టి మరీ చూపించింది. చైనా నుంచి తెచ్చుకున్న రక్షణ వ్యవస్థలు ఎందుకు పనికి రాలేదు. దీనికి తోడు తాము ప్రయోగించిన క్షిపణులు అన్ని ఎస్ -400 ముందు కొరగానివిగా మిగిలిపోయాయి. దీంతో ఢిల్లీని ఇస్లామాబాద్ శరణువేడింది. యుద్ధం ఆపేద్దామంటూ విన్నవించుకుంది. యుద్ధం అయిపోయిన తర్వాత తన రక్షణ రంగ పరిస్థితిపై పాక్ సమీక్ష చేస్తోంది. దీనిలో భాగంగా రక్షణ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపడుతోంది.
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ క్షిపణుల దెబ్బ రుచి చూసిన పాకిస్థాన్ ఇప్పుడు రాకెట్ ఫోర్స్ (Pakistan New Rocket Force) ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ కార్యక్రమంలో ప్రకటన చేశారు. పాక్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా ఈ రాకెట్ ఫోర్స్ పనిచేస్తుందని వెల్లడించారు. దీనికి అత్యాధునిక టెక్నాలజీని సమకూరుస్తామని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక దళంపై ఆ దేశ సైనికాధికారి ఒకరు మాట్లాడుతూ.. దీనికి ప్రత్యేకమైన కమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. సంప్రదాయ యుద్ధం జరుగుతున్న వేళ క్షిపణుల మోహరింపు వంటి అంశాలను ఇదే చూసుకొంటుందని పేర్కొన్నారు. ఈ రాకెట్ ఫోర్స్‌ను భారత్‌ను దృష్టిలో ఉంచుకొనే ఏర్పాటు చేస్తున్నట్లు ఓ ఆంగ్ల వార్త సంస్థకు ఆయనే వెల్లడించారు.
అంతకు ఒక రోజు ముందే పాక్ (Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌పై బెదిరింపు ప్రకటనలు చేశారు. సింధూ జలాల నుంచి న్యూఢిల్లీ ఒక్క చుక్క నీరు తీసుకొన్నా సహించేది లేదని పేర్కొన్నారు. భారత్ ఎన్నడూ మర్చిపోలేని గుణపాఠం చెబుతామని ప్రేలాపనలు చేశారు. ఈ జలాలు పాక్‌కు ప్రాణాధారమని పేర్కొన్నారు. వీటి విషయంలో రాజీ పడే పరిస్థితే లేదని చెప్పారు.
మరోవైపు పాకిస్థాన్‌లో పీపీపీ నేత బిలావల్ భుట్టో కూడా భారత్‌పై విషం కక్కారు. మోడీ (PM Modi)కి వ్యతిరేకంగా ఏకం కావాలని పాకిస్థానీలకు పిలుపునిచ్చారు. ఇక ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మరో అడుగు ముందుకేసి.. అమెరికా వేదికగా అణు బెదిరింపులకు పాల్పడ్డారు. ‘భారత్ హైవేపై వస్తున్న ఒక మెర్సిడెస్ కారులాంటిది. కానీ.. పాకిస్థాన్ మాత్రం ఓ డంప్ ట్రక్కులాంటిది. ఒకవేళ కారు వచ్చి లారీని ఢీకొంటే ఎవరికి నష్టం?’’ అని మునీర్ తన ప్రసంగంలో పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో సోమవారం కథనాలు వచ్చాయి. తమ దేశం ఇబ్బందుల్లో పడితే సగం ప్రపంచాన్ని తమతోపాటు తీసుకెళతామని చెప్పారు. సింధూ నదిపై డ్యామ్ నిర్మిస్తే క్షిపణులతో పేల్చేస్తామని కూడా వ్యాఖ్యానించారు.