Pakistan: అటు అణు బెదిరింపులు.. ఇటు నీటికోసం దేబిరింపు.. పాక్ కు ఇంకా అర్థం కాలేదా..?

పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ రక్షణ పాటవంపై.. అక్కడి ప్రజల్లోనే నమ్మకం అడుగంటింది. భారత్ ముందు మోకరిల్లి, ఇంక ఆపండి చాలు తట్టుకోలేకపోతున్నామని బతిమలాడితే తప్పా.. సిందూర్ ఆపరేషన్ ఆగలేదు. మరోవైపు.. సింధూ జలాల్ని భారత్ నిలిపివేయడంతో .. తమ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భయం పాక్ నేతల్లో కనిపిస్తోంది. దీంతో వారికి ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. భారత్ తో దోస్తీ అంటే ఉగ్రవాదులు మండిపోతారు. కాదంటే.. భారత్ తాట తీస్తుంది. ఇదీ పాక్ పరిస్థితి.
సిందూ జలాల నిలిపివేతకు సంబంధించి ఓ వైపు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్, మాజీ మంత్రి బిలావల్ భుట్టో బెదిరింపులకు పాల్పడుతుండగా..మరోవైపు తమకు నీటిని విడుదల చేయాలని ఆ దేశ విదేశాంగ శాఖ భారత్‌ను వేడుకుంటోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌కు నిలిపివేసిన సింధూ జలాల సరఫరాను తిరిగి పునరుద్ధరించాలని ఆ దేశ విదేశాంగ శాఖ తాజాగా న్యూఢిల్లీని కోరింది. ఈ ఒప్పందాన్ని నమ్మకంగా, న్యాయబద్ధంగా కొనసాగించాలని కోరుతున్నట్లు తెలిపింది.
మరోవైపు పాకిస్థాన్ సైన్యాధిపతి అసీం మునీర్ (Asim Munir) భారత్‌పై అణు హెచ్చరికలు చేస్తూ.. నోరు పారేసుకుంటున్నారు. ‘భారత్ అనేది హైవేపై వస్తున్న ఒక మెర్సిడెస్ కారులాంటిది. కానీ.. పాకిస్థాన్ మాత్రం కంకరతో నిండిన ఓ డంప్ లారీలాంటిది. ఒకవేళ కారు వచ్చి లారీని ఢీకొంటే ఎవరికి నష్టం?’’ అని మునీర్ తన ప్రసంగంలో పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో సోమవారం కథనాలు వచ్చాయి. ఆ దేశ విదేశాంగశాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో (Bilawal Bhutto) సైతం భారత్‌పై పిరికిపంద ప్రేలాపనలు చేశారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగితే.. యుద్ధం గురించి ఆలోచించడం తప్ప మరో మార్గం లేదని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. ఈ నేపథ్యంలో నీటిని విడుదల చేయాలని భారత్‌ను, పాక్ విదేశాంగ శాఖ అభ్యర్థించడం పరిస్థితికి అద్దం పడుతోంది.
1960ల్లో భారత్, పాక్ మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) కుదిరింది. ఉగ్రదాడి దృష్ట్యా దీని అమలును న్యూఢిల్లీ నిలిపివేయడంతో దాయాది దేశానికి నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. జలాశయాల్లో నీటిమట్టం దారుణంగా పడిపోయింది. ఇక వాటినుంచి నీటిని తీసుకోలేని స్థితి ఎదురవుతోంది. గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్‌లో నీటి ప్రవాహం 15 శాతం తగ్గింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు ఖరీఫ్‌లో మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. భారత్ నిర్ణయంతో 21 శాతం నీటి కొరత ఏర్పడుతుందని పాక్ అంచనా వేసింది. అయితే ఉగ్రవాదంపై పాక్ తీరు మారే వరకూ ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసింది.