Terrorists Killed: పాక్ అబద్ధాలు బట్టబయలు.. సిందూర్ దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు ఖతం

మే 7న పాకిస్తాన్ తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని తీవ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో ఐదుగురు కీలక తీవ్రవాదులు హతమయ్యారు. ఈ దాడులు ‘ఆపరేషన్ సిందూర్’లో (Operation Sindoor) భాగంగా జరిగాయి. భారతదేశ భద్రతకు ముప్పుగా ఉన్న తీవ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఈ దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో లష్కర్-ఎ-తాయిబా (LeT), జైష్-ఎ-మహ్మద్ (JeM) సంస్థలకు చెందిన ముఖ్య నాయకులను టార్గెట్ చేశారు. ఈ దాడుల్లో హతమైన తీవ్రవాదుల (terrorists) వివరాలు ఇప్పుడు బయటపడ్డాయి. ఇది పాకిస్తాన్‌లోని సైనిక, ప్రభుత్వ సంస్థలకు తీవరవాద సంస్థలతో ఉన్న సంబంధాలను మరోసారి బహిర్గతం చేసింది.
హతమైన తీవ్రవాదుల వివరాలను చూస్తే…
1. ముదస్సర్ ఖాదియన్ ఖాస్ (ముదస్సర్ అలియాస్ అబూ జుందాల్)
లష్కర్-ఎ-తోయిబాకు చెందిన ఈ తీవ్రవాది మురిద్కేలోని మర్కజ్ తాయిబాకు ఇన్‌ఛార్జ్ గా ఉన్నాడు. అతని అంత్యక్రియల్లో పాకిస్తాన్ సైన్యం గౌరవ సూచకంగా ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇచ్చింది. పాక్ ఆర్మీ చీఫ్, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ తరపున పుష్పగుచ్ఛాలు కూడా ఉంచారు. ప్రభుత్వ పాఠశాలలో జరిగిన అతని అంత్యక్రియల ప్రార్థనను జమాత్-ఉద్-దావా (JuD) నాయకుడు హఫీజ్ అబ్దుల్ రవూఫ్ నడిపించాడు. ఇతను అంతర్జాతీయంగా గుర్తించబడిన తీవ్రవాది. ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఒక సీనియర్ లెఫ్టినెంట్ జనరల్, పంజాబ్ పోలీస్ ఐజీ కూడా హాజరయ్యారు.
2. హఫీజ్ ముహమ్మద్ జమీల్
జైష్-ఎ-మహ్మద్ సభ్యుడైన జమీల్… జైష్ నాయకుడు మౌలానా మసూద్ అజహర్‌కు సమీప బంధువు (అతని అల్లుడి అన్న). బహవల్‌పూర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లాకు ఇన్‌ఛార్జ్ గా ఉన్న జమీల్.. యువతను తీవ్రవాదంలోకి ఆకర్షించడంలోనూ, జైషే మహ్మద్ కోసం నిధుల సేకరణలో కీలక పాత్ర పోషించాడు.
3. మొహమ్మద్ యూసుఫ్ అజహర్ (ఉస్తాద్ జీ అలియాస్ మొహద్ సలీం అలియాస్ ఘోసీ సాహెబ్)
మసూద్ అజహర్‌కు మరో బంధువైన యూసుఫ్.. జైష్-ఎ-మహ్మద్‌లో ఆయుధ శిక్షణకు బాధ్యత వహించాడు. జమ్మూ కాశ్మీర్‌లో పలు తీవ్రవాద దాడుల్లో అతను పాల్గొన్నాడు. 1999లో జరిగిన IC-814 విమాన హైజాక్ కేసులో వాంటెడ్ వ్యక్తిగా ఉన్నాడు. అతని మరణం జైష్ సంస్థకు పెద్ద దెబ్బగా పరిగణించబడుతోంది.
4. ఖాలిద్ (అబూ అకాషా)
లష్కర్-ఎ-తోయిబాకు చెందిన ఖాలిద్.. జమ్మూ కాశ్మీర్‌లో పలు దాడుల్లో పాల్గొన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్‌లో భాగస్వామిగా ఉన్నాడు. అతని అంత్యక్రియలు ఫైసలాబాద్‌లో జరిగాయి. ఇందులో పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ అధికారులు, ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ పాల్గొన్నారు.
5. మొహమ్మద్ హసన్ ఖాన్
జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన హసన్ ఖాన్.. PoKలో జైష్ ఆపరేషనల్ కమాండర్ గా ఉన్న ముఫ్తీ అస్ఘర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడు. జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాద దాడులను సమన్వయం చేయడంలో అతను కీలక పాత్ర పోషించాడు.
ఆపరేషన్ సిందూర్ ద్వారా లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మహ్మద్ సంస్థల నాయకత్వానికి గణనీయమైన దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ ద్వారా భారత్.. తీవ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన సందేశాన్ని పంపింది. ఈ దాడులు పాకిస్తాన్‌లోని సైనిక, ప్రభుత్వ సంస్థలు తీవ్రవాద సంస్థలకు అందిస్తున్న మద్దతును మరోసారి బహిర్గతం చేశాయి. ముదస్సర్, ఖాలిద్ అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ అధికారుల హాజరు కావడం వాళ్ల మధ్య సంబంధాలకు స్పష్టమైన సాక్ష్యంగా నిలుస్తుంది.