Alaska: అలస్కాలో చర్చలు అలా ముగిశాయి.. పుతిన్-ట్రంప్ భేటీలో కుదరని డీల్…

ఒకవైపు అగ్రరాజ్యాధినేత ట్రంప్ (Trump) స్వయంగా ఆహ్వానించాడు. మరోవైపు.. ప్రపంచానికి రెండో ధృవం లాంటి రష్యా అధ్యక్షుడు కదిలి వచ్చాడు. ఇంకేముంది చర్చలు షురూ అయ్యాయి. ఏదో ఓ నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించారు. కానీ ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఏనిర్ణయం తీసుకోకుండానే చర్చలు ముగిశాయి. అయితే మరోసారి చర్చలకు మాస్కో రావాలని పుతిన్.. ఈసారి ట్రంప్ ను ఆహ్వానించారు. అదే ఇక్కడ కాస్త ఊరట కలిగించే అంశం.
అలస్కా వేదికగా దాదాపు 3 గంటల పాటు ఇద్దరు నేతలు చర్చించారు. మరీ ముఖ్యంగా ఉక్రెయిన్ లో సీజ్ ఫైర్ అమలు చేయించేందుకు ట్రంప్.. పూర్తిస్థాయిలో ప్రయత్నించాడు. అయితే .. పుతిన్ మహా తెలివిగా ప్రవర్తించాడు. ఆయన ఏమైతే పూర్తి చేయాలనుకున్నారో.. అక్కడి వరకే చర్చలను ముందుకు తీసుకెళ్లారు. చాలా అంశాలు పరిష్కారం కాకుండానే చర్చలు ముగిశాయి. ఇది ఓ రకంగా ముందడుగుగా ట్రంప్ అభివర్ణిస్తే.. సమస్య పరిష్కారంలో తొలి అడుగుగా పుతిన్ స్పష్టం చేశారు. అంతేకాదు.. డీల్ పూర్తికావడంపై నిర్ణయం జెలెన్ స్కీ చేతుల్లోనే ఉందన్నారు ట్రంప్.
‘‘ఒప్పందం చేసుకోవాలని జెలెన్‌స్కీకి సూచిస్తా. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశం ఉంది. రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్‌స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉంది’’ అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
జెలెన్‌స్కీతో భేటీ అయ్యేందుకు వ్యతిరేకం కాదని, కొన్ని షరతులకు తప్పనిసరిగా అంగీకరించాలన్నారు పుతిన్ (Putin). సంతకాలు చేయడానికి శాంతి ఒప్పందం సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే భేటీ ఉంటుందని క్రెమ్లిన్ ఇప్పటికే వెల్లడించింది కూాడ.
ట్రంప్‌తో భేటీ చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయతీగా ఉన్నట్లు చెప్పారు. వివాదానికి ముగింపు పలకడానికి తొలి అడుగుగా పుతిన్ అభివర్ణించారు. ఈ సందర్భంగా ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపిన పుతిన్.. ట్రంప్‌తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదన్నారు.