Jamming Vibes: ‘జామింగ్ వైబ్స్’ ఆవిష్కరణ.. ప్రతినెలా 4వ శనివారం ‘సింగలాంగ్ రిచువల్’!
సంగీతాన్ని కేవలం వేదికపై ప్రదర్శనగా కాకుండా, ఒక ఉమ్మడి భావోద్వేగంగా మార్చేందుకు ఉద్దేశించిన ‘జామింగ్ వైబ్స్’ (Jamming Vibes) అనే సరికొత్త ప్రపంచవ్యాప్త ‘సింగలాంగ్’ ఉద్యమం ప్రారంభమైంది. సంగీత ప్రియులైన జ్యోత్స్న కొంపల్లి, విజయ్ దానగారి ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా 4వ శనివారం జామింగ్ రిచువల్ నిర్వహించనున్నారు. ఈ నెలవారీ సంగీత సమావేశంలో శిక్షణ పొందిన గాయకులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, లేదా మొదటిసారి ప్రదర్శన ఇచ్చేవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. ఇక్కడ ఎలాంటి పోటీ, తీర్పు, లేదా అడ్డంకులు ఉండవు. “మీరు ఈ కమ్యూనిటీలో ఉండడానికి గాయకులవ్వాల్సిన అవసరం లేదు, సంగీతాన్ని ప్రేమించాలంతే” అనే తత్వమే ఈ ఉద్యమాన్ని నడిపిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని అధికారికంగా హైదరాబాద్లోని ఉత్సవ్ కన్వెన్షన్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబాలు, క్రియేటర్లు, యువత, వర్కింగ్ ప్రొఫెషనల్స్, సంగీత ప్రియుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈవెంట్లో ప్రేక్షకులే పాటలు పాడటం, గ్రూప్ భాగస్వామ్యం, పాత మెలోడీలు, అపరిచితులు అంతా కలిసి అద్భుతమయిన భావోద్వేగ అనుబంధం కనిపించింది.
ఈ అనుభవాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి, ప్రత్యేకించి ఎన్నారై (NRI) తెలుగు కమ్యూనిటీల కోసం, జామింగ్ వైబ్స్ ఒక లైవ్ ఆన్లైన్ భాగస్వామ్య అవకాశాన్ని పరిచయం చేసింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్కు మాత్రమే పరిమితం చేయకుండా, 4వ శనివారం రిచువల్ను అనేక నగరాలకు విస్తరించాలని ఈ కమ్యూనిటీ యోచిస్తోంది. మరింత సమాచారం కోసం వారు www.jammingvibes.com ను సందర్శించవచ్చు.






