Wipro : విప్రో చైర్మన్, సీఈఓ వేతనం ఎంతో తెలుసా?

ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో (Wipro) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా రిషద్ ప్రేమ్‌జీ (Rishad Premji) గత ఆర్థిక సంవత్సరంలో 1.6 మిలియన్ డాలర్లు పారితోషికం అందుకున్నారు. భారత కరెన్సీలో రూ.13.7 కోట్లు పొందారు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఈ మొత్తం అందుకున్నట్లు కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం రెట్టింపు అయింది. అయితే, విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా (Srinivas Palliya) పారితోషికంతో పోలిస్తే రిషద్ ప్రేమ్‌జీకి చేసిన చెల్లింపులు తక్కువే కావడం గమనార్హం. ఇదే కాలానికి పల్లియా 6.2 మిలియన్ డాలర్లు అంటే రూ.53.64 కోట్లు పారితోషికంగా పొందారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రిషద్ ప్రేమ్‌జీ రూ.6.4 కోట్లు మాత్రమే పారితోషికం తీసుకున్నారు. ఆ ఏడాది కంపెనీ లాభంలో క్షీణత నమోదు కావడంతో ఆయన ఎలాంటి కమీషన్ తీసుకోలేదు. అలాగే, తనకు చెల్లించే జీతభత్యాల్లో 20 శాతం కోత విధించుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో విప్రో తన నికర లాభంలో 18.9 శాతం వృద్ధి నమోదు చేసి రూ.13,135.4 కోట్లు ఆర్జించింది. దీంతో ఆయన పారితోషికం కూడా రూ.6.4 కోట్ల నుంచి రూ.13.7 కోట్లకు పెరిగింది.