RBI: కేంద్ర ప్రభుత్వానికి గుడ్ న్యూస్… ఆర్‌బీఐ భారీ డివిడెండ్

కేంద్ర ప్రభుత్వానికి రిజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను డివిడెండ్ (Dividend) గా రూ.2.69 లక్షల కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి ఆర్‌బీఐ రూ.2.1 లక్షల కోట్లు చెల్లించింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఈ మొత్తం 27.4 శాతం మేర పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ రూ.87,416 కోట్లు డివిడెండ్ రూపంలో చెల్లించింది. ఏటికేడు ఈ మొత్తం పెరుగుతూ వస్తోంది.
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) నేతృత్వంలో ఆర్‌బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్లు (Central Board of Directors) నిర్వహించిన 616వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద మొత్తంలో మిగులు నిధులను బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రిస్క్ ముప్పును సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. కంటిజెంట్ రిస్క్ బఫర్ లెవల్‌ను కూడా 6.5 శాతం నుంచి 7.50 శాతానికి పెంచింది.