ASBL NSL Infratech

వైసీపీ కంచుకోటలో కూటమి పరుగు...

వైసీపీ కంచుకోటలో కూటమి పరుగు...

రాయలసీమ ...వైసీపీకి కంచుకోట. నాలుగు సీమ జిల్లాలకు గానూ ఒక్క అనంతపురం తప్పిస్తే మిగిలిన మూడు జిల్లాల్లోనూ ఫ్యాన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అధికంగా సీట్లు వచ్చేవి కూడా ఆజిల్లాలే. అయితే 2019తో పోలిస్తే ఇప్పుడు మాత్రం పరిస్థితిలో మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు పోటీకి అభ్యర్థులు సైతం దొరకని పరిస్థితి నుంచి గట్టి అభ్యర్థులను బరిలో నిలపడమే కాదు.. ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నాయి విపక్షాలు. ముఖ్యంగా కూటమిగా బరిలోకి దిగుతుండడం కూడా ఈపరిస్థితికి ఓకారణంగా చెప్పొచ్చు.

అయితే ఇటీవలి కాలంలో రాయలసీమలో ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. పూర్తిగా స్థానాలను విపక్షాలు గెలుచుకునేంత పరిస్థితి లేకపోయినా.. వైసిపి పై మాత్రం వ్యతిరేకత పెరుగుతోంది. దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలో అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణం జరగకపోవడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడకపోవడం లాంటి కారణాలు అధికారపార్టీపై వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సీన్ మారుతోంది. దశాబ్దాల రాజకీయ చరిత్ర తీసుకుంటే రాయలసీమ వాసులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.

రాయలసీమలో కాంగ్రెస్ భావజాలం కూడా అధికం. 2014లో రాష్ట్ర విభజన, వైసీపీ ఆవిర్భావం తదితర కారణాలతో సీమవాసులు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ కావడంతో అటువైపుగా చూస్తున్నారు. ప్రత్యామ్నాయ పార్టీగా భావిస్తున్నారు. వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు కూడా పెరుగుతున్నాయి. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిన వారిలో రాయలసీమ వాసులే అధికం. మరోవైపు రాయలసీమను వివేకానంద రెడ్డి హత్య కేసు కుదిపేస్తోంది. ఈ విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించడం కూడా వైసీపీ పట్ల ప్రతికూలత చూపుతోంది. రాజన్న బిడ్డకు వేస్తారా? వైయస్ వివేకానంద రెడ్డిని చంపిన వాడికి ఓటు వేస్తారా? అన్న షర్మిల పిలుపు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్తోంది.

రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. ఇందులో కడప, కర్నూలులో వైసీపీకి ఏకపక్ష విజయం దక్కుతూ వస్తోంది. చిత్తూరులో సైతం వైసీపీకి ఎక్కువ స్థానాలు వస్తూ ఉండేవి. అనంతపురం మాత్రం తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ వస్తోంది. అయితే ఇటీవల ఓ సర్వేలో కర్నూలు తోపాటు కడపలో తెలుగుదేశం పార్టీ తన బలం పెంచుకున్నట్లు తేలింది. మొత్తానికి పరిస్థితి గమనిస్తే, అధికారపార్టీకి కాస్త ఎదురుగాలి వీస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికైతే రాయలసీమలో వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నట్టే కనిపిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :