ASBL NSL Infratech

‘మోదీని ఢీకొట్టే నేత ఎవరు?’.. ఆసక్తికర సమాధానమిచ్చిన శశిథరూర్

‘మోదీని ఢీకొట్టే నేత ఎవరు?’.. ఆసక్తికర సమాధానమిచ్చిన శశిథరూర్

ప్రస్తుతం దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా నడుస్తుందనడం అతిశయోక్తి కాదు. అందుకే మోదీని ఢీ కొట్టగలిగే ఆ స్థాయి ప్రతిపక్ష నేత ఎవరనే ప్రశ్న చాలా కాలం నుంచి వినిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశీథరూర్‌ దీనిపై స్పందించారు. ఈ మధ్యనే తనను ఓ విలేకరి ఇదే ప్రశ్న అడిగారంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్న ఆయన.. తనదైన శైలిలో సమాధానం కూడా ఇచ్చారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఓ విలేకరి.. ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వ్యక్తి ఎవరో చెప్పాలంటూ తనను ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారని అందులో పేర్కొన్నారు.

అలాగే ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ.. పార్లమెంటరీ వ్యవస్థలో ఈ ప్రశ్నే అసంబద్ధమైందన్నారు. అధ్యక్ష వ్యవస్థల్లో మాదిరిగా దేశ ప్రజలు ఎవరో ఓ వ్యక్తిని ఎన్నుకోవడం లేదని, భారతదేశ వైవిధ్యం, బహుళత్వం, సమ్మిళిత వృద్ధిని సంరక్షించడం కోసం రూపొందించిన విధివిధానాలను పాటించే పార్టీ లేదా సంకీర్ణ కూటమిని ఎన్నుకుంటామని అన్నారు. ‘‘ఇక్కడ ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరంటే.. వ్యక్తిగత అహాన్ని పక్కనబెట్టి ప్రజల సమస్యలపై పోరాడే అనుభవజ్ఞులైన, సమర్థులైన నాయకుల కూటమే. అలా ఎన్నికైన కూటమి తమలో ఎవరో ఒకరిని ప్రధానిగా ఎన్నుకుంటుంది’’ అంటూ సమాధానమిచ్చారు.

కేరళలోని తిరువనంతపురం నుంచి 3సార్లు ఎంపీగా గెలుపొందిన శశిథరూర్‌.. నాలుగోసారి కూడా విజయకేతనం ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో మరోసారి తిరునంతపురం నుంచే బరిలోకి దిగారు. ఆయనపై పోటీగా బీజేపీ నుంచి కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఎన్నికల్లో నిలబడ్డారు. వీరికి తోడు లెఫ్ట్ పార్టీల నుంచి పన్నియన్‌ రవీంద్రన్‌ బరిలో ఉండడంతో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఏడు దశల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో రెండో దశలో భాగంగా తిరువనంతపురంలో ఏప్రిల్‌ 26న పోలింగ్ జరగనుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :