ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలంగాణ అసెంబ్లీ సమరం...

తెలంగాణ అసెంబ్లీ సమరం...

తెలంగాణ శాసనసభలో అధికార, విపక్షాల మధ్య వ్యూహాత్మక సమరానికి తెరలేచింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ 64 మంది సభ్యులు, ఒక్క సీపీఐ ఎమ్మెల్యే మద్ధతుతో, ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. మరో వైపు 39 ఎమ్మెల్యేలతో గులాబీ పార్టీ, 8 మంది ఎమ్మెల్యేలతో కమలం పార్టీ, 7 గురు ఎమ్మెల్యేలతో ఎం.ఐ.ఎం పార్టీ ఈ కొత్త అసెంబ్లీలో కొలువు తీరనున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ టార్గెట్ గా పని చేయనున్నాయి.

మరోవైపు అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్.. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు.ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఓటర్లు అసెంబ్లీకి పంపారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అసెంబ్లీ సమావేశాల్లో గట్టి ప్రతిఘటన ఎదురుకానుంది. 39 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ గట్టి ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉంది. వీరితో పాటు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 7 ఎం.ఐ.ఎం ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు సృష్టించే అవకాశాలు లేకపోలేదు.

తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్

ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్ స్థానాలకు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఈ మారు కొత్త పాత్ర పోషించనున్నారు. తెలంగాణ శాసన సభలో ప్రతిపక్ష నేత హోదాతో కేసీఆర్ అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అయితే ప్రమాదవశాత్తూ తుంటి విరగడంతో ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్.. నెలరోజులపాటు కార్యక్రమాలకుదూరంగా ఉండనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టనప్పటికీ రానున్న రోజుల్లో జరిగే సమావేశాల్లో మాత్రం కేసీఆర్ ను ప్రతిపక్ష నేత పాత్రలో ప్రజలు చూసే అవకాశం ఉంది.

ఈ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక..

ఈ సమావేశాల్లోనే శాసన సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ నుండి గెలిచిన వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా నామినేషన్ వేశారు. ఈ సమావేశాల్లో ఆయన స్పీకర్ గా ఎన్నికవ్వనున్నారు. తదనంతరం జరిగే బీఏసీ సమావేశాల్లో అసెంబ్లీ చర్చించాల్సిన ఎజెండా, ఎన్ని రోజులు సభ నిర్వహించాలన్న దానిపై స్పష్టత రానుంది.

అధికార, ప్రతిపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలు

ఈ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశాలున్నాయి. అధికార కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్..., గత పదేళ్లుగా అధికార పార్టీగా పాలన సాగించిన బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హమీల అమలుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ను పట్టుపట్టే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇష్టారీతిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హమీలు ఇచ్చిందని అందుకు నిధులు ఎలా తెస్తారో.. ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు చెప్పాలని ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంది. ఆరు గ్యారంటీల పథకాలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇక కాంగ్రెస్ పార్టీ సైతం రాష్ట్రంలో పదేళ్లుగా సాగిన గులాబీ పాలనపైన విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపైన ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసి బీఆర్ఎస్ ను ఇరుకునపెట్ట వచ్చని తెలుస్తోంది. అప్పులు చేసిన తీరుపైన, విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపైన బీఆర్ఎస్ ను కార్నర్ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మరో వైపు బీజేపీ, ఎం.ఐ.ఎంలు సైతం అధికార కాంగ్రెస్ టార్గెట్ గానే అసెంబ్లీలో వ్యూహాలు ఉంటాయని తెలుస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :