ASBL NSL Infratech

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో భారతదేశ 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో భారతదేశ 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

న్యూయార్క్: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో దేశభక్తి పూర్వక సాహిత్యంతో కూడిన 75 లలిత గీతాలను, 75 మంది గీత రచయితలు రచించగా, 75 మంది గాయనీ గాయకులు గానం చేయగా వాటిని ఆగస్ట్ 15 వ తేదీన అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో ఆవిష్కరించి ఈ సంవత్సరం భారతదేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైవిధ్యంగా, సంగీత భరితంగా, ఉత్సాహంగా, ఘనంగా జరుపుకోనున్నట్లు తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఎంపిక చేసిన ఈ 75 లలిత గీతాలలో గతంలో అద్భుతమైన దేశభక్తి పూర్వక లలితగీతాలు రచించిన దేవులపల్లి, సినారె, దాశరధి, గిడుగు, బాలాంత్రపు, రాయప్రోలు, మల్లవరపు, కందుకూరి, ఇంద్రగంటి, వింజమూరి, శశాంక, కోపల్లె లాంటి ఎందరో మహానుభావుల గీతాలు, ఈ తరం రచయితలైన వోలేటి, వడ్డేపల్లి, కలగా, రసమయి రాము, వారణాశి, బాపురెడ్డి, బలభద్రపాత్రుని మధు, సుధామ గార్లు రాసిన గీతాలను, ప్రముఖ సినీ గేయ రచయితలు సుద్దాల, జొన్నవిత్తుల, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, భువనచంద్ర, భారవి, సిరాశ్రీ, కాసర్ల మొదలైన వారి లలిత గీతాలతో పాటు నవతరం రచయితల గీతాలు కూడా ఉంటాయన్నారు.

లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ అధినేత శ్రీ కొమండూరి రామాచారి నిర్వహణలో ఈ లలిత గీతాలకు స్వరకల్పన చేసి, వివిధ దేశాలలో ఉన్న 75 మంది ఉత్తమ గాయనీగాయకులచే గానం చేయిస్తారని, మధురా ఆడియో కంపెనీ అధినేత శ్రీ శ్రీధర్ రెడ్డి సారధ్యంలో ఈ  గీతాలకు కావలిసిన అన్ని హంగులను సమకూర్చి వీడియో రూపంలోకి తీసుకు వచ్చి, ఆగస్ట్ 15న జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో అంతర్జాలంలో అంతర్జాతీయ స్థాయిలో అందరికి ఉచితంగా అందుబాటులో ఉండేటట్లు గా తానా ప్రపంచ సాహిత్య వేదిక ద్వారా యూట్యూబ్ లో ఆ 75 లలిత గీతాలను విడుదల చేస్తామని ప్రకటించారు.

సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ఆసక్తి ఉన్న రచయితలు 1. భారతీయ సంస్కృతి 2. దేశభక్తి స్ఫూర్తి 3. జాతీయోద్యమ సంఘటనలు 4. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం అనే ఏ ఇతివృత్తంతో అయినా ఒక పల్లవి, రెండు చరణాలకు మించని లలిత గీతాలను ఎ4 సైజులో వచ్చేటట్లుగా వ్రాసి, ఈ రచన మీ సొంతమని రాతపూర్వకంగా ధృవీకరిస్తూ, మీ చిరునామా, ఫోన్ నెంబర్ తెలియపరుస్తూ మే 20, 2021 గడువు తేదీ లోగా +91-91210 81595 కు WhatsApp ద్వారా పంపమని ఆహ్వానం పలికారు.   

నిర్ణాయక సంఘం మీ రచనను పరిశీలించి, ఎంపిక చేసినట్లయితే ఆ విషయాన్ని మీకు జూలై 15 వ తేదీలోపు తెలియజేస్తామని, తుది నిర్ణయం నిర్ణాయక సంఘానిదేనన్నారు. మిగిలిన వివరాలకు www.tana.org ను సందర్శించవచ్చు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :