మరోసారి సెట్స్‌పైకి క్రేజీ కాంబినేషన్?

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు భలే క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రేజున్న కాంబినేషన్లలో రవితేజ, హరీష్ శంకర్ కాంబో కూడా ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన షాక్ ఇద్దరికీ పెద్ద షాకిచ్చినా, తర్వాత వచ్చిన మిరపకాయ్ సినిమా మంచి రిజల్ట్ నిచ్చింది. మిరపకాయ్ సినిమా అప్పట్లో రవితేజకు పెద్ద విజయాన్ని అందించింది.
రవితేజకు మాత్రమే కాదు హరీష్ శంకర్ కెరీర్‌కు కూడా మిరపకాయ్ విజయం ఎంతో ఉపయోగపడింది. అయితే వీరిద్దరి కలయికలో ఆ తర్వాత సినిమాలు రాలేదు. మధ్యలో చేద్దాం అనుకున్నారు కానీ ఆ టైమ్ కి అది వర్కవుట్ అవలేదు. త్వరలోనే వీరిద్దరి కాంబోలో సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ పనుల్లో బిజీగా ఉన్న హరీష్, వీలైనంత త్వరగా సినిమాను ఫినిష్ చేసి, తర్వాతి ప్రాజెక్టులను త్వరత్వరగా తీయాలని ఆలోచనలో ఉన్నాడట. పవన్ మూవీ పుణ్యమా అని హరీష్, మైత్రీ నిర్మాతలకు బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమా తర్వాత కూడా మరో రెండు సినిమాలు ఆ బ్యానర్‌లో చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే ముందుగా రవితేజతో సినిమా చేయాలని హరీష్ చూస్తున్నాడట. దానికి తోడు మైత్రీ, రవితేజ కాంబోలో గతంలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ డిజాస్టర్ కావడంతో ఆ నష్టాలను తీర్చడానికి మరో సినిమా చేస్తానని మైత్రీ నిర్మాతలకు రవితేజ మాట ఇచ్చాడని టాక్. హరీష్ కు కూడా ఎలాగూ మైత్రీతో కమిట్మెంట్లు ఉన్నాయి కాబట్టి మైత్రీ బ్యానర్‌లో హరీష్, రవితేజ కలిసి వచ్చే ఏడాది సినిమా చేసే అవకాశాలున్నాయి.