ASBL NSL Infratech

ముద్రగడ టార్గెట్ ఫిక్సయ్యారా..?

ముద్రగడ టార్గెట్ ఫిక్సయ్యారా..?

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం...జనసేనాని పవన్ కల్యాణ్‌ను తన టార్గెట్‌గా ఫిక్స్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. లేచింది మొదలు పవన్ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పిఠాపురంలో ముద్రగడ పోటీ చేయకున్నా.. వంగా గీతను మించి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. తనను జనసేనలోకి ఆహ్వానించి అవమానపరిచారని ఇదివరకు చెప్పుకున్న ముద్రగడ.. అదే కారణంతో కాబోలు పవన్ ను గుర్తు చేస్తేనే ఊగిపోతూ మాట్లాడుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి ముద్రగడ జనసేన వైపు మొగ్గు చూపారు. జనసేనలో చేరితే..పొత్తులో భాగంగా ఈజీగా సీటు దక్కించుకొని యాక్టివ్ రాజకీయాలు చేయవచ్చని భావించారు. పవన్ నుంచి దూతలు వచ్చి ఆహ్వానించేసరికి ఉబ్బితబ్బిబ్బయ్యారు.

అదే సమయంలో వైసీపీ నుంచి వచ్చిన ఆఫర్ ను తిరస్కరించారు. అక్కడి పెద్దలతో సైతం అమర్యాదగా మాట్లాడారు. అయితే పవన్ నేరుగా వచ్చి ఆహ్వానిస్తారని వేచి చూశారు. రోజులు వారాలయ్యాయి.. వారాలు నెలలు అయ్యాయి. కానీ పవన్ పట్టించుకోలేదు. వైసీపీ ఇచ్చిన ఆఫర్ దక్కలేదు. చివరకు గత్యంతరం లేని స్థితిలో ఆయన వైసీపీలో చేరాల్సి వచ్చింది. అయితే...పవన్‌ను ఎంత స్ట్రాంగ్ గా తిడితే.. వైసీపీలో అంత మర్యాద దక్కే అవకాశం ఉండడంతో.. వేదిక ఏదైనా ముద్రగడ వదలడం లేదు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

తణుకులో జరిగిన కాపు నేతల ఆత్మీయ సమ్మేళనంలో అయితే పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు ముద్రగడ. చంద్రబాబు ఎస్టేట్ కు పవన్ కళ్యాణ్ జనరల్ మేనేజర్ గా అభివర్ణించారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్యాకప్ చేసి పంపాలని కాపులను కోరారు. సినిమా షూటింగ్స్ గ్యాప్ లో వచ్చి రాజకీయాలు చేసే వారికి ఓట్లు వేయొద్దని కోరారు. ప్రజల్లో ఉండే వారిని మాత్రమే గెలిపించాలని పిలుపునిచ్చారు. పేకాట క్లబ్బులు నడిపే వారితో పవన్ కళ్యాణ్ తనను తిట్టిస్తున్నారని మండిపడ్డారు.

సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అటు చంద్రబాబును ముద్రగడ విడిచిపెట్టలేదు. ఎవరైనా నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని చెబుతారని.. చంద్రబాబు మాత్రం నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పడం అమానుషమన్నారు. 2024 ఎన్నికల్లో ఆ ఇద్దరికీ ఏపీ రాష్ట్ర ప్రజలు ప్యాకప్ చెబుతారని కూడా తేల్చి చెప్పారు. అయితే పిఠాపురం వచ్చి ప్రచారం చేయాల్సిన ముద్రగడ.. తణుకులో ఉండి కాపుల్ని చైతన్య పరిచేలా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఆయన ఎంత కష్టపడి కూటమి వైపు కాపులను వెళ్లకుండా చేస్తే.. జగన్ నుంచి అంతలా ప్రతిఫలం పొందే అవకాశం ఉంది. అందుకే ఆయన వ్యక్తిగత విమర్శలు చేసేందుకు కూడా వెనుకడుగు వేయడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :