ASBL NSL Infratech

రివ్యూ : ఫుల్ యాక్షన్ ఫీస్ట్ 'కేజీయఫ్‌' చాప్టర్‌ 2

రివ్యూ  : ఫుల్ యాక్షన్ ఫీస్ట్ 'కేజీయఫ్‌' చాప్టర్‌ 2

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5

నిర్మాణ సంస్థ: హోంబలే ఫిలింస్‌
నటీనటులు : య‌శ్, సంజ‌య్ ద‌త్, శ్రీ‌నిధి శెట్టి, ర‌వీనా టాండ‌న్, ప్ర‌కాశ్ రాజ్, అర్చ‌న‌, ఈశ్వ‌రీరావు, రావు రమేశ్‌ తదితరులు
సంగీతం: ర‌వి బ‌స్రూర్, సినిమాటోగ్ర‌ఫి: భువ‌న్ గౌడ‌, నిర్మాత: విజయ్ కిరగందూర్, దర్శకుడు:  ప్రశాంత్‌ నీల్‌
విడుదల తేది: 14.04.2022

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో కేజీయఫ్‌ చాప్టర్  2 ఒకటి. 2018లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కన్నడ సినిమా స్టామినాను దేశ వ్యాప్తంగా చూపించిన చిత్రం ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 1’ విడుదలైన ఆ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను సృష్టించింది. అలాంటి సినిమాకు సీక్వెల్‌ వస్తుందంటే..భారీ అంచనాలు ఉండడం సహజం. అందుకు తగ్గట్టే.. కేజీయఫ్‌ 2 తీర్చిదిద్టినట్లుగా టీజర్‌, ట్రైలర్‌ని చూపించారు మేకర్స్‌. దీంతో ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు భారీ అంచనాలతో  వేచి చూశారు. బహుబలి సీక్వెల్ తర్వాత ఓ మూవీ సీక్వెల్‌ కోసం ప్రేక్షకులు.. అంతా వేచి చూస్తోన్న సినిమా ఏదైనా ఉందంటే అది కేజీయఫ్‌ 2 అనే చెప్పవచ్చు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ రోజు  గురువారం (ఏప్రిల్‌ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పార్ట్‌ 1 సూపర్‌ హిట్‌ కావడం, పార్ట్‌2 టీజర్‌, ట్రైలర్‌ అదిరిపోవడంతో ‘కేజీయఫ్‌ 2’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కేజీయఫ్‌ 2ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు. కేజీయఫ్‌ 1 స్థాయిని కేజీయఫ్‌2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం. 

కథ:

బానిసలా వందేళ్లు బతికేకన్నా.. రాజులా ఒక్కరోజు బతికినా చాలు అనే కథాంశంతో వచ్చిన చిత్రమే ‘కె.జి.ఎఫ్’. అమ్మకిచ్చిన మాట కోసం ఒక నిరుపేద కుర్రాడు.. మొత్తం వ్యవస్థే తనవైపు చూసేంతగా ఎలా ఎదిగాడు అని చెప్పే కథే ‘కె.జి.ఎఫ్’. నీ కోసం ఈ భూమి మీద ఉన్న బంగారమంతా తెచ్చి ఇస్తానమ్మ అని చిన్నారిగా ఉన్నప్పుడు తల్లికి చెప్పిన రాకీ.. తాను ఎదిగాక కోలార్ గోల్డ్ మైన్స్‌ను ఎలా చేజిక్కించుకున్నాడు అనే విషయాన్ని ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 1’లో చూపించారు. కె.జి.ఎఫ్: చాప్టర్ 1 మూవీ ఎక్కడ ముగిసిందో.. అక్కడ నుంచి కేజీయఫ్‌ 2 కథ మొదలవుతుంది. మొదటి పార్ట్‌లో రాకీ భాయ్‌ స్టోరీని ప్రముఖ రచయిత ఆనంద్‌ వాసిరాజు(అనంత్‌ నాగ్‌) చెబితే.. పార్ట్‌ 2లో ఆయన కుమారుడు విజయేంద్రవాసిరాజు(ప్రకాశ్‌ రాజ్‌) కథ చెబుతాడు. గరుడను చంపిన తర్వాత నరాచి లైమ్‌ స్టోన్‌ కార్పొరేషన్‌ను రాకీ భాయ్‌ (యశ్‌) తన ఆధీనంలోకి తీసుకుంటాడు. గరుడ పెట్టే చిత్రహింసల నుంచి బయట పడడంతో అక్కడి కార్మికులు యశ్‌ని రాజుగా భావిస్తారు. తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు.

ఇక కేజీయఫ్ సామ్రాజ్యంలో తనకు ఎదురులేదని అనుకుంటున్న సమయంలో ‘నరాచి లైమ్‌ స్టోన్‌ కార్పొరేషన్‌’ సృష్టికర్త సూర్యవర్ధన్‌ సోదరుడు అధీరా(సంజయ్‌ దత్‌) తెరపైకి వస్తాడు. అదే సమయంలో రాజకీయంగా కూడా రాకీబాయ్‌ సవాళ్లను కూడా ఎదుర్కొవాల్సివస్తుంది. అతని సామ్రాజ్యం గురించి తెలుసుకున్న భారత ప్రధానమంత్రి రమికా సేన్‌(రవీనా టాండన్‌)..అతనిపై ఓ రకమైన యుద్దాన్ని ప్రకటిస్తుంది. ఒకవైపు అధీరా నుంచి, మరోవైపు రమికా సేన్‌ ప్రభుత్వం నుంచి ముప్పు ఏర్పడిన సమయంలో రాకీభాయ్‌ ఏం చేశాడు? తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు?. శత్రువులు వేసిన ఎత్తులను ఎలా చిత్తు చేశాడు? తనను దేవుడిగా భావించిన కార్మికుల కోసం ఏదైనా చేశాడా? అమ్మకు ఇచ్చిన మాట కోసం చివరికి ఏం చేశాడు? అనేదే మిగతా కథ.

నటి నటుల హావభావాలు:

చాప్టర్ 1లో రాకీ భాయ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది కానీ.. స్టైలిష్‌గా అనిపించదు. కానీ, ఇందులో మాత్రం రెండింటి మేళవింపు ఉంది. రాకీ భాయ్ వాకింగ్ స్టైల్, కాస్ట్యూమ్స్, ఎలివేషన్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సినిమా స్టార్టింగ్‌లో విలన్లకు సంబంధించిన వ్యక్తి, యశ్‌ గురించి చెబుతూ.. "ఇంట్లో ఉన్న ఎలుకలను బయటకు తోలడానికి పాముని పంపారు, ఇప్పుడు అది నల్ల తాచు అయింది" అని అంటాడు. అంటే హీరో మరింత బలపడ్డాడు అనే అర్థంతో ఆ డైలాగ్‌ చెబుతాడు. కేజీయఫ్‌2లో యశ్‌ నటన కూడా అంతే. మొదటి భాగంతో పోలిస్తే.. ఇందులో మరింత స్టైలీష్‌గా, తనదైన మేనరిజంలో డైలాగ్స్‌ చెబుతూ..అదరగొట్టేశాడు. రాకీ భాయ్‌ పాత్రకు యశ్‌ తప్పితే మరొకరు సెట్‌ కాలేరు అన్న విధంగా అతని నటన ఉంది. యాక్షన్‌ సీన్స్‌లో విశ్వరూపం చూపించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా మంచి నటనను కనబరిచాడు. అధీరగా సంజయ్‌ దత్‌  ఫెర్పార్మెన్స్‌ బాగుంది. ఆయన పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. ఈ సినిమా షూటింగ్‌కి ముందే సంజయ్‌ దత్‌కి కేన్సర్‌ అని తేలింది. అయినా కూడా ఆయన అధీర పాత్రలో నటించడం అభినందించాల్సిందే. ప్రధానమంత్రి రమికా సేన్‌ పాత్రకి ర‌వీనా టాండ‌న్ న్యాయం చేసింది. రావు రమేశ్‌, ఈశ్వరి భాయ్‌, ప్రకాశ్‌ రాజ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ప్రతి ఒక్కరి పాత్రకి తగిన ప్రాధాన్యత ఉండడం ఈ సినిమాలో చెప్పొకోతగ్గ విషయం.

సాంకేతికవర్గం పనితీరు:

సాంకేతికంగా ఈ సినిమా అద్భుతమనే చెప్పాలి. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ సినిమా ప్రధాన బలాలో ఒకటి. రవి బస్రూర్ నేపథ్య సంగీతంతో థియేటర్‌లో మోత మోగిపోయింది. తన బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో ప్రతి సన్నివేశాన్ని పైకి లేపారు. అయితే, అక్కడక్కడ మోత మరీ ఎక్కువైపోయింది అనిపిస్తుంది. భువ‌న్ గౌడ‌ సినిమాటోగ్రఫి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కేజీయఫ్‌ సామ్రాజ్యాన్ని అందంగా చిత్రీకరించాడు. విజువల్స్ చూస్తుంటే డబ్బు ఏ స్థాయిలో ఖర్చుపెట్టారో అర్థమవుతుంది. సుమారు 60 ఏళ్ల క్రితం జరిగిన కథ కాబట్టి.. అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా సినిమాను తీర్చిదిద్దారు. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. ఉజ్వల్‌ ఎడిటింగ్‌ బాగుంది. ఇక హోంబలే పిక్చర్స్ నిర్మాణ విలువల గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతంగా ఉన్నాయి.

విశ్లేషణ:

చాప్టర్ 1లో యాక్షన్‌తో పాటు కథ, అందులోని భావోద్వేగాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడు.. చాప్టర్ 2లో మాత్రం యాక్షన్, ఎలివేషన్‌కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ, ఆ యాక్షన్, ఎలివేషన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయి. ముఖ్యంగా రాకీ భాయ్ ఇంట్రడక్షన్ సీన్.. అధీర పరిచయం.. ఇంటర్వెల్ తరవాత వచ్చే సన్నివేశాలు అదుర్స్ అంతే. అయితే, కథలో ట్విస్టులు లేకపోవడం మైనస్‌. ఇక అధీర పాత్ర తీర్చిదిద్దిన విధానం బాగున్నప్పటికీ.. రాకీభాయ్‌, అధిరాకు మధ్య వచ్చే ఫైట్‌ సీన్స్‌ మాత్రం అంతగా ఆసక్తికరంగా సాగవు. అధిర పాత్రను మరింత బలంగా చూపిస్తే బాగుండేదేమో. ఫస్టాఫ్‌లో రాకీభాయ్‌ ఎదిగే తీరుని చాలా ఆసక్తికరంగా చూపించాడు. కేజీయఫ్‌ పార్ట్‌నర్స్‌తో జరిపిన మీటింగ్‌, ఇయత్‌ ఖలీల్‌తో జరిపిన డీల్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే హీరో ఎలివేషన్స్‌ ఓ రేంజ్‌లో చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్‌లో పార్లమెంట్‌లోకి వెళ్లి మాజీ ప్రధానిని చంపడం సినిమాటిక్‌గా అనిపిస్తుంది.

‘కేజీయఫ్‌’అభిమానులకు మాత్రం ఆ సీన్‌తో సహా ప్రతి సన్నీవేశం నచ్చుతుంది. బహుశా దర్శకుడు కూడా వారిని మెప్పించడానికే హీరో ఎలివేషన్స్‌లో మరింత స్వేచ్ఛ తీసుకున్నాడేమో. అయితే కథని మాత్రం ఆ స్థాయిలో మలచుకోలేకపోయాడు. ఈ క్రమంలో సాధారణ ప్రేక్షకుడు ఒకింత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, యాక్షన్ సీన్స్ ఒకదాని వెనుక ఒకటి వచ్చేస్తూనే ఉంటాయి. దీనివల్ల కథకు ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వలేడేమో అనిపిస్తుంది. కానీ, ఫస్ట్‌ పార్ట్‌తో పోలిస్తే.. ఇందులో మదర్‌ సెంటిమెంట్‌ కాస్త తక్కువే అని చెప్పాలి. మధ్య మధ్యలో తల్లి మాటలను గుర్తు చేస్తూ కథను ముందుకు నడిపారు. ఇక హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్‌ కథకి అడ్డంకిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే చివర్లో మాత్రం తల్లి కాబోతున్న విషయాన్ని హీరోకి తెలియజేసే సీన్‌ హృదయాలను హత్తుకుంటుంది. సముద్రం ఎందుకంత వెలిగిపోతుందని కొడుకు అడిగిన ప్రశ్నకి తల్లి చెప్పిన సమాధానాన్ని, క్లైమాక్స్‌తో ముడిపెట్టడం ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్లను బాగా ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఒక విజువల్ వండర్. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :