ASBL NSL Infratech

ప్యాలెస్ కాలింగ్... వైసీపీ నేతల్లో దడదడ..

ప్యాలెస్ కాలింగ్... వైసీపీ నేతల్లో దడదడ..

2024 ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఇటీవలే జరిగిన కేబినెట్ మీటింగ్ లో సైతం ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని చెప్పినట్లు సమాచారం. ఎటు చూసినా సరే ఏపీలో ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలోనే 11 మంది సిట్టింగ్ స్థానాలను సీఎం జగన్ మార్చడం మిగతా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు రేపుతోంది. మరో 45 మంది జాబితా సిద్ధంగా ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాలు పదిలమో కాదో అని టెన్షన్ పడుతున్నారు. రెండురోజులుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలకు కాల్స్ వస్తున్నాయి. దీంతో వారు ప్యాలెస్ కు వచ్చి సీఎం జగన్ ను కలుస్తున్నారు.

ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా సమావేశమవుతున్న సీఎం జగన్... వారి నియోజకవర్గ పరిస్థితిని వివరిస్తున్నారు. అక్కడ ఎలాంటి మార్పులు అవసరమన్న అంశంపైనా చర్చిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో పరిస్థితి అస్సలు బాగోలేని వారికి మాత్రం వారి ప్రోగ్రెస్ కార్డు చూపించి, టికెట్ ఖాళీ చేయాల్సిందేనని ఖరాఖండీగా చెబుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలకు ప్యాలెస్ నుంచి పిలుపు రావడంతో .. వారు సీఎం జగన్ ను కలిశారు. మంత్రి చెన్నుబోయిన వేణు గోపాల్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులు చంటిబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజ, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరిలు కూడా సీఎంవోకు రావడం చర్చనీయాంశమైంది.

అయితే, ఈ అందరితో జగన్ వేర్వేరుగా భేటీ అయ్యారు. మరికొంతమంది మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. దీంతో సీఎంను మంత్రులు విశ్వరూప్, గుమ్మనూరు జయరాం, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, విశాఖపట్నం జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తూగో. జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కలిశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై సీఎం జగన్ చర్చించారు. నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇన్‌చార్జీలను వైసీపీ అధినేత ఖరారు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సీటు విషయమై అభ్యర్థులకు సీఎం జగన్ స్పష్టత ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి రాబోయే ఎన్నికల్లో టికెట్ నిరాకరిస్తున్నారని, అందుకు గల కారణాలను జగన్ వివరిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, వారి స్థానంలో నియమితులైన అభ్యర్థులకు సహకరించాలని జగన్ చెబుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

అయితే, టికెట్ దక్కని వారికి రాబోయే ఎన్నికల్లో గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన ప్రాధాన్యతను కల్పిస్తానని కూడా జగన్ హామీ ఇస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు మిగిలిన వైసీపీ నేతలు....తాడేపల్లి ప్యాలెస్ నుంచి కబురు వస్తుందేమో అని కంగారు పడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తానని జగన్ తేల్చి చెప్పడంతో తమ నెంబర్ వస్తుందేమో అని చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. వచ్చే వారం ఎంపీ అభ్యర్థుల జాబితాపై సీఎం ఇదే తరహా సమావేశాలను ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :