ASBL NSL Infratech

రివ్యూ: కొంచం ఫన్, కొంచం ఫ్ర‌స్ట్రేషన్, కొంచం మెసేజ్ 'ఎఫ్‌3'

రివ్యూ: కొంచం ఫన్, కొంచం ఫ్ర‌స్ట్రేషన్, కొంచం మెసేజ్ 'ఎఫ్‌3'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు : వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్‌, రాజేంద్రప్రసాద్‌, అలీ సునీల్‌ తదితరులు
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్‌, సినిమాటోగ్ర‌ఫి: సాయి శ్రీరామ్‌, ఎడిటర్‌: తమ్మిరాజు
నిర్మాత: దిల్‌ రాజు, శిరీష్‌, దర్శకుడు: అనిల్‌ రావిపూడి
విడుదల తేది: 27.05.2022

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ మల్టీస్టారర్‌గా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన 2019 సంక్రాంతికి విడుదలైన ఎఫ్‌2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తామంటూ  F3ని తీసుకొచ్చాడు అనిల్‌ రావిపూడి. కరోనా కారణంగా పలుమార్లు షూటింగ్ ఆలశ్యం అయినా ఈ మూవీ ఎట్టకేలకు ఈ రోజు (మే27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు, స్టార్స్ ఇంటర్వ్యూలు  సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దీనికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌ చేయడంతో ఎఫ్‌3పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఎఫ్‌3 ఏమేరకు అందుకుంది? వెంకటేశ్‌, వరుణ్‌ల తో పాటు ఈ చిత్రానికి అదనంగా చేరిన అలీ, సునీల్ ల   కామెడీ మరోసారి వర్కౌట్‌ అయిందా? హిట్‌ కాంబినేషన్‌గా పేరొందిన అనిల్‌, దిల్‌రాజు ఖాతాలో విజయం చేరిందా లేదా? ప్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. 

క‌థ‌:

ఎఫ్‌2లో భార్యల వల్ల వచ్చే ఫ్రస్టేషన్ ను చూపించిన అనిల్‌ రావిపూడి.. ఎఫ్‌3లో డబ్బు వల్ల వచ్చే ఫ్రస్టేషన్‌ను చూపించాడు. ఈ ‍సినిమాలోని పాత్రలన్నింటికీ డబ్బు పిచ్చి ఉంటుంది. కథ విషయానికొస్తే...  విజ‌య‌న‌గ‌రంలో ఉండే ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ ప్ర‌సాద్ (ముర‌ళీ శ‌ర్మ‌)ను చూసి అంద‌రూ గౌర‌విస్తుంటారు. అయితే త‌న చుట్టూ ఉండే డ‌బ్బుని చూసే అంద‌రూ విలువ ఇస్తున్నార‌ని ఆయ‌న భావిస్తుంటాడు. పంచ భూతాలు గురించి అంద‌రికీ తెలుసు. కానీ తెలియ‌ని ఆరో భూతం కూడా ఉంద‌ని, అది ఈ ప్ర‌పంచాన్ని శాసిస్తుంద‌ని.. అదే డ‌బ్బు అని ఆనంద్ ప్ర‌సాద్ న‌మ్ముతుంటాడు. హైద‌రాబాద్‌లో ఉండే వెంకీ (వెంక‌టేష్‌) పెళ్లి సంబంధాలు కుద‌ర్చ‌టం, లైసెన్స్‌లు ఇప్పించ‌టం వంటి ప‌నులు చేసి డ‌బ్బులు సంపాదిస్తుంటాడు. అత‌నికి రేచీక‌టి. కానీ ఎవ‌రికీ తెలియ‌కుండా మేనేజ్ చేస్తూ వ‌స్తుంటాడు. అత‌ని స్నేహితుడు వ‌రుణ్ యాదవ్ (వ‌రుణ్ తేజ్‌) అనాథ‌. డ‌బ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే క‌ష్టాలు తీరిపోయి డ‌బ్బులో మునిగి తేలొచ్చ‌ని న‌మ్మే వ్య‌క్తి. వెంకీ - వ‌రుణ్ ఇద్ద‌రూ మంగ టిఫిన్స్‌కి చెందిన హారిక (త‌మ‌న్నా) - హనీ(మెహ‌రీన్) చేతిలో మోస‌పోతారు. అప్పులు చేస్తారు. అదే స‌మ‌యంలో నిజాయ‌తీగా ఉండే సీఐ నాగ‌రాజు (రాజేంద్ర ప్ర‌సాద్‌) డ్యూటీ చేసి ప‌ట్టుకున్న డ‌బ్బులు, డైమండ్స్‌ని పోలీస్ క‌మీష‌న‌ర్ కొట్టేస్తాడు. దాంతో నాగరాజు త‌న నిజాయ‌తీని ప‌క్క‌న పెట్టి.. క‌మీష‌న‌ర్ ఇంట్లో దొంగ‌త‌నం చేయాల‌న‌కుంటాడు. అందుకు వెంకీ - వ‌రుణ్ అండ్ గ్యాంగ్ స‌పోర్ట్ తీసుకుంటాడు. పోలీస్ చెకింగ్స్ ఉన్న కార‌ణంగా వారు ఆ డ‌బ్బుని ఓ కారు స్క్రాపింగ్ యార్డ్‌లో దాస్తారు. ఆ డ‌బ్బుల‌ను ఎవ‌రో దొంగలిస్తారు. అదే స‌మ‌యంలో వారికి ఆనంద్ ప్ర‌సాద్ కొడుకు చిన్న‌ప్పుడే త‌ప్పిపోయాడనే నిజం తెలుస్తుంది. ఆయ‌న కొడుకుగా న‌టించి డ‌బ్బులు కొట్టేయాల‌నుకుంటారు. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ‌తారు. చివ‌ర‌కు ఆనంద్ ప్ర‌సాద్ కొడుకు ఎవ‌రు? అస‌లు వెంకీ - వ‌రుణ్ డ‌బ్బులు, డైమండ్స్ కొట్టేసిన వ్య‌క్తి ఎవ‌రు? ఆనంద్ ప్ర‌సాద్ చివ‌ర‌కు వీరి జీవితాల‌ను ఎలా మ‌లుపు తిప్పాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

నటీనటుల హావభావాలు:

వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ వారి వారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. వెంకటేశ్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడిపించాలన్నా.. నవ్వించాలన్నా వెంకటేశ్‌ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఆయన కామెడీ చేస్తే ప్రేక్షకులు పడిపడి నవ్వాల్సిందే. రేచీకటి సమస్యతో బాధపడుతున్న వెంకీ పాత్రలో వెంకటేశ్‌ అద్భుతంగా నటించాడు. తన ఇమేజ్‌ని పూర్తిగా పక్కకు పెట్టి.. తనదైన కామెడీతో నవ్వించాడు. ఇక వెంకటేశ్‌తో పోటాపోటీగా నటించాడు వరుణ్‌ తేజ్‌. నత్తి ఉన్న వరుణ్‌ యాదవ్‌ పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగ్స్‌ బాగా పేలాయి. మంగ టిఫిన్‌ సెంటర్‌ నడిపే యువతి హారికగా తమన్నా, ఆమె చెల్లిగా హనీగా  మెహ్రీన్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. సెకండాఫ్‌లో తమన్నా సరికొత్త గెటప్‌లో కనిపిస్తుంది. వరుణ్‌ స్న్నేహితుడు కత్తి శీనుగా సునీల్‌ మెప్పించాడు. చాలా కాలం తర్వాత ఒకప్పటి కామెడీ సునీల్‌ని తెరపై చూడొచ్చు. ఇక వడ్డీ వ్యాపారీ పాల బాజ్జీగా అలీ, వ్యాపారవేత్త ఆనందప్రసాద్‌గా మురళీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు:

జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ సినిమాలు అంటే జనాలు పొట్టచెక్కలయ్యే కామెడీ పక్కా అని ఫిక్స్‌ అయ్యేవారు ప్రేక్షకులు. ఇప్పుడు అదే పంథాలో వెళ్తున్నాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా దూసుకుపోతున్నాడు. ఎఫ్‌2తో భార్యల వల్లే వచ్చే ఫ్రస్టేషన్‌ చూపించి, చివరిలో వారి గొప్పదనం ఏంటో అందరికి అర్థమయ్యేలా చెప్పాడు. ఇక ఎఫ్‌3లో డబ్బు వల్ల కలిగే ఫ్రస్టేషన్‌ చూపించి..చివరిలో మంచి సందేశాన్ని అందించాడు.  దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం చాలా బాగుంది. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు.పూజా హెగ్డే స్పెషల్‌ సాంగ్‌ అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. సాయి శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తమ్మిరాజు తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. డైలాగ్స్ అన్నీ కామెడీ కోణంలో ఓకే అనిపిస్తాయి.కానీ ఎమోష‌నల్ కోణంలో మాత్రం క‌నెక్ట్ కావు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. 

విశ్లేషణ:

ఈ చిత్రంలో  క‌థ ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యం స‌గ‌టు ప్రేక్ష‌కుడికి అర్థ‌మైపోతుంది. ఇక క్లైమాక్స్‌, దాని ముందు వ‌చ్చే స‌న్నివేశాల‌న్నీ కామెడీగా కాకుండా.. కాస్త ఇబ్బందిగానే మార‌తుంది. చివ‌ర‌లో వెంక‌టేష్ నార‌ప్ప‌గా, వ‌రుణ్ తేజ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ‌కీల్ సాబ్ పాత్ర‌లో మెప్పించాల‌నుకోవ‌డం అన్నీ క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లోనే సాగిపోతుంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి స్టోరీని పక్కకు పెట్టి కామెడీనే నమ్ముకున్నాడు. హీరోలకు లోపం ఉన్న క్యారెక్టర్లు ఇచ్చి హాస్యాన్నీ  పండించాడు. రేచీకటితో వెంకటేశ్‌, నత్తితో వరుణ్‌తేజ్‌ చేసే కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ఈజీగా డబ్బు సంపాదించేందుకు వెంకీ, వరుణ్‌ పడే పాట్లతో ఫస్టాఫ్‌ అంతా రొటీన్‌ కామెడీతో సాగుతుంది. రేచీకటి లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వెంకీ పడే పాట్లు నవ్విస్తాయి. ముఖ్యంగా ‘వెంకట్రావు పెళ్లాన్ని చూశా..’అంటూ వెంకీ చెప్పే డైలాగ్‌కు ప్రేక్షకులు పడిపడి నవ్వుతారు. ఇక సెకండాఫ్‌లో నిజంగానే మూడురెట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో ‘లాజిక్‌ అని, రియలిస్టిక్‌ అని మమ్మల్ని ఎంతకాలం దూరంపెడతారు రా’ అని  పోలీసు వేషంలో ఉన్న తనికెళ్ల భరణితో ఓ డైలాగ్‌ చెప్పించి.. తమ మూవీలో అవేవి ఉండవని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. ఎఫ్ 2 మీదున్న అంచ‌నాల‌తో వెళితే మాత్రం నిరాశ ప‌డ‌క త‌ప్పదు. అయితే ఓసారి సినిమాను చూసేయ‌వ‌చ్చు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :