ASBL NSL Infratech

కాళేశ్వరంతో 'బీఆర్ఎస్' కు చెక్...?

కాళేశ్వరంతో 'బీఆర్ఎస్' కు చెక్...?

కేసీఆర్ కలల స్వప్నం, ఆయన మానసపుత్రిక లాంటి కాళేశ్వరం.. బీఆర్ఎస్ కు ఉపద్రవంలా మారుతోందా...? కేసీఆర్ తద్వారా బీఆర్ఎస్ కు చెక్ చెప్పేందుకు కాంగ్రెస్.. కాళేశ్వరంపై విచారణను ఓ ఆయుధంగా ఎంచుకోనుందా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. .. అవుననే అనిపిస్తోంది. ఎన్నికల ముందు నుంచి ఉధృతంగా ప్రచారం చేస్తూ వస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రేవంత్‌రెడ్డి సర్కార్‌ ప్రత్యేక పోకస్‌ పెట్టింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో జరిగిన డ్యామేజీలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సీఎం రేవంత్ ఆదేశించారు.అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సభ్యులందరినీ కూడా మేడిగడ్డకు తీసుకెళ్లి చూపిస్తామని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై రాష్ట్ర మంత్రివర్గం ఆదేశాల మేరకు విచారణకు ఆదేశిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడిన నేపథ్యంలో.. వాటిని డిజైన్‌ చేసిన, నిర్మించిన వారిని బాధ్యులుగా చేసి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సవివరంగా లిఖితపూర్వక వివరణ సమర్పించాల్సిందిగా నీటిపారుదల శాఖను ఆదేశించినట్టు తెలిపారు.

నీటిపారుదల శాఖలో భారీ అవినీతి జరిగిందని, ప్రాజెక్టుల నిర్మాణంలో గోప్యత పాటిస్తున్నారని, రహస్య జీవోలు ఇచ్చారంటూ అనేక ఆరోపణలున్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. దీనిపై పూర్తివివరాలు కావాలన్నారు. దీంతో నిర్మాణ సంస్థ ఎల్ ఎండ్ టీ .... యూ టర్న్ తీసుకుంది. అదనపు ఒప్పందం చేసుకుంటేనే మరమ్మతులు చేస్తామని తేల్చి చెప్పింది. ఎల్ అండ్ టీ ప్రకటనతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాకులు చెప్పి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఎవ్వరినీ వదిలేది లేదన్నారు. ఎప్పుడైతే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల డిజైనింగ్, అవకతవకలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ చేసిందో... అధికారులు అప్రమత్తమయ్యారు. దాని డిజైనింగ్ తాము చేపట్టలేదని, కేవలం నిర్మాణం మాత్రమే చేపట్టామని వెల్లడించారు.

డిజైనింగ్ బాధ్యతను కేసీఆర్ నిర్వహించారని చెప్పినట్లు సమాచారం. అంతేకాదు ప్రభుత్వ సంస్థల ఆమోదం కూడా లేదన్నట్లు తెలుస్తోంది. అయితే.. మేడిగడ్డ, అన్నారమేనా.. ఇంకా ఏమైనా బ్యారేజీల డిజైనింగ్ కూడా జరిగిందా అన్న కోణంలోనూ మంత్రులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.. కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.లక్ష కోట్లను ఖర్చు చేసినా, ఆయకట్టుకు నామమాత్రంగానే సాగునీరు లభిస్తోందని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం అక్రమాలపై ఫోకస్ పెట్టడం.... అధికార యంత్రాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది.నాడు సీఎం కేసీఆర్ చెప్పారని, అన్నింటికీ తలూపిన అధికారులు.. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అడకత్తెరలో పడినట్లు తయారైంది. ఈ ప్రభుత్వం ఆ అవినీతిని తవ్వి తీసి , బాధ్యులను శిక్షిస్తామనడంతో కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :