ASBL NSL Infratech

పొలం బాటలో కేసీఆర్

పొలం బాటలో కేసీఆర్

సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా విపక్షనేత కేసీఆర్.. ప్రత్యేక ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో కారు పార్టీకి అండగా నిలిచిన రైతన్నల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా తొలిసారిగా పొలంబాటను ఎంచుకున్నారు. ఎండిపోయిన రైతుల పొలాలను పరిశీలించి, వారితో మాట్లాడి, సమస్యలు తెలుసుకుంటున్నారు. దీనికి కారణం కాంగ్రెస్ సర్కార్ .. అస్తవ్యస్త విధానాలే అన్న అంశాన్నివారిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏప్రిల్‌ 2న మూడు జిల్లాల్లో పర్యటించిన గులాబీ బాస్‌.. రెండో విడతలో కరీంనగర్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్‌ ప్రకటించాలని, పంటలు ఎండి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన సంక్షేమపథకాలు రైతు బంధు, రైతు బీామా, కోతలు లేని విద్యుత్, డ్యాములను నింపి ఉంచేవాళ్లమన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు కేసీఆర్.

తాము ఇప్పటికే రైతులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామంటున్న కాంగ్రెస్ నేతలు.. కేసీఆర్ హయాంలో అమలుకాని పథకాలను తెరపైకి తెస్తున్నారు.2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.లక్ష రుణమాఫీ, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి చెల్లించలేదన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఐదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ చేయని కేసీఆర్‌.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేయమనడం ఎంతవరకు సమంజసమని, ఎన్నికల కోసం రైతుల జపం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఫామ్‌హౌస్, ప్రగతి భవన్‌ విడిచి రాని కేసీఆర్, రైతుబీమా రూ.5 లక్షలు ఇస్తున్నామని చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మాత్రం రైతుల కోసం పోరాడుతున్నట్లు డ్రామా చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలతోనే కేసీఆర్ యాత్రలు ముగుస్తాయా..? లేదంటే ప్రజలు, రైతులు,యువత, మహిళలు సమస్యల్లో ఉన్నప్పుడు .. తిరిగి ఉద్యమ పథంలో స్పందిస్తారా..? అన్నది క్వశ్చన్ మార్కుగా మారింది. అయితే.. ఎన్నికల సమయంలో తప్పా, తిరిగి కేసీఆర్ జనానికి కనిపించరన్న అభియోగాలు ఉండనే ఉన్నాయి. వాటిని దూరం చేసుకుంటే తప్ప గులాబీపార్టీకి మంచిరోజులు వచ్చేలా లేవన్నది.. ఆపార్టీ నేతలు గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయాలున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :