ASBL NSL Infratech

బీఆర్ఎస్‌లో చేరనున్న సుమన్..! కాపులకు ఝలక్…!!

బీఆర్ఎస్‌లో చేరనున్న సుమన్..! కాపులకు ఝలక్…!!

సినీ నటుడు సుమన్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, ఇప్పుడున్న పార్టీల్లో బీఆర్ఎస్ సిద్ధాంతాలు తనకు నచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఆయన త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుమన్ సుపరిచితులు. ఒకవేళ ఆయన బీఆర్ఎస్ లో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది. పోటీ చేస్తారా.. లేకుంటే గతంలో లాగా కేవలం మద్దతుదారుడిగా ఉంటారా.. అనేది కూడా తెలియట్లేదు.

సుమన్ ఒకప్పుడు స్టార్ హీరో. చిరంజీవికి పోటీగా నిలిచిన నటుడు. 80-90లలో సుమన్ టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేశారు. అయితే అనుకోని అవాంతరాలు ఆయన కెరీర్ ను నాశనం చేశాయి. ఎక్కడో పాతాళానికి పడిపోయారు. అయితే ఆ తర్వాత కోలుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సపోర్టింగ్ యాక్టర్ గా, విలన్ గా మంచి పాత్రలు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కెరీర్ పీక్ స్టేజ్ లోనే ఉందని చెప్పొచ్చు. అయితే సినిమాల్లోనే కాకుండా అడపాదడపా సామాజిక సేవా కార్యక్రమాల్లో సుమన్ పాల్గొంటూ ఉంటారు. సామాజిక సమస్యలపై స్పందిస్తూ ఉంటారు.

 

సుమన్ కు రాజకీయాలు కొత్తకాదు. గతంలో పలు పార్టీలకు ఆయన సేవలందించారు. 1999లోనే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చాయంటూ తెలుగుదేశం పార్టీకి ప్రచారం నిర్వహించారు. పార్టీలో చేరకుండా కేవలం మద్దతుదారుడిగా ఉన్నారు. ఆ తర్వాత 2004లో భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే యాక్టివ్ పాలిటిక్స్ లో భాగస్వామ్యం కాలేదు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. సినిమాల్లో బిజీ అయిపోయారు. అయితే ఇటీవలికాలంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా సుమన్ కామెంట్స్ చేయడంతో ఆయన జనసేనలో చేరుతారని భావించారు.

ఇప్పుడు మళ్లీ ఆయన రాజకీయాలపై ఆసక్తి కనబరిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన సుమన్.. తనకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు బాగా నచ్చినట్లు చెప్పారు. దీంతో ఆయన త్వరలోనే ఆ పార్టీలో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కాపు సామాజిక వర్గ నాయకుడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాను కేసీఆర్ పార్టీ విధానాల పట్ల ఆకర్షితుడైనట్లు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఆ కార్యక్రమానికి హాజరైన కాపు నేతలు, ప్రజలంతా పవన్ కల్యాణ్ పార్టీలో చేరతారను భావించారు. అయితే వాళ్లందరికీ సుమన్ ఝలక్ ఇచ్చారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :