ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కాంగ్రెస్ పార్టీతో షర్మిల చెట్టాపట్టాల్..! ఎవరికి లాభం..!?

కాంగ్రెస్ పార్టీతో షర్మిల చెట్టాపట్టాల్..! ఎవరికి లాభం..!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. ఇందుకోసం ప్రధాన పార్టీలన్నీ గట్టిగా ఫైట్ చేస్తున్నాయి. అయితే అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చిన్నాచితకా పార్టీలు ట్రై చేస్తున్నాయి. అధికారాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్, పాగా వేయాలని బీజేపీ, మళ్లీ గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. అయితే షర్మిల కూడా తానూ రేసులో ఉన్నానంటోంది. బీఎస్పీ తరపున ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, టీజేఎస్, మల్లన్న.. తదితర పార్టీలు కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

తాను తెలంగాణ ఇంటి కోడలినని, ఇక్కడ రాజన్నరాజ్యం తీసుకురావడమే ధ్యేయమని షర్మిల ప్రకటించారు. ఇక్కడి ప్రజలకోసం ఆంధ్రాను వదిలేసి వచ్చానని చెప్పారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే సంబంధం లేకుండా అన్ని పార్టీలను ఏకిపారేస్తున్నారు. అయితే ఆమె కామెంట్స్ పలుమార్లు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. అరెస్టులకు కారణమయ్యాయి. అయినా షర్మిల మాత్రం తగ్గట్లేదు. తమదే అధికారమని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించబోతున్నామని ఆమె ధీమాగా చెప్తున్నారు.

అయితే ఇటీవల ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. కాంగ్రెస్ తో షర్మిల కలవబోతున్నారని తెలంగాణతో పాటు జాతీయ మీడియా కూడా కోడైకూస్తోంది. రెండు పార్టీల నుంచి దీనికి సంబంధించి ఎవరూ నోరు మెదపకపోయినా... ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఈ వార్త మరింత జోరందుకుంది. తాజాగా జాతీయ మీడియా కూడా ఈ వార్తను ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి. ఆయన మరణం తర్వాత వై.ఎస్. కుటుంబం బయటికొచ్చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. ఇప్పుడు జగన్ నేతృత్వంలో ఆ పార్టీ ఏపీలో అధికారంలో ఉంది. అయితే అన్నతో విభేదాల వల్ల ఆ పార్టీ నుంచి, కుటుంబం నుంచి షర్మిల పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయాన్ని ప్రారంభించిన వై.ఎస్.ఆర్ కుటుంబం ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ గూటికే చేరడం ఆసక్తి కలిగిస్తోంది. అయితే ఇప్పటికీ తెలంగాణలో వైఎస్ కు అభిమానులున్నారని, ఆ ఓట్లు షర్మిలకు పడతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం తప్పదు. పైగా రెడ్డి ఓటు బ్యాంకుపైనే కాంగ్రెస్ ఎక్కువగా ఆదారపడుతుంది. ఆ ఓట్లను షర్మిల చీలుస్తుంది. దీని వల్ల కాంగ్రెస్ నష్టపోవడంతో పాటు ఇతర పార్టీలకు లబ్ది చేకూరుతుంది. అందుకే రెండు పార్టీలు కలిసి పని చేస్తే ఇరు పార్టీలకూ మేలు జరుగుతుందనే భావన వాళ్లకు ఉన్నట్టు సమాచారం. అందుకే పొత్తు పట్టుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందో..!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :