ASBL NSL Infratech

రివ్యూ : అహో! ‘ఆచార్య’దేవా! ఏమిటి చిత్రం?

రివ్యూ : అహో! ‘ఆచార్య’దేవా! ఏమిటి చిత్రం?

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటెర్టైన్మెంట్స్
నటీనటులు : చిరంజీవి, రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే, సోనూసూద్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌
సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్ర‌ఫి: తిరు, ఎడిటర్‌: నవీన్‌ నూలి; సమర్పణ: శ్రీమతి సురేఖ కొణిదెల
నిర్మాతలు: నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కొరటాల శివ
విడుదల తేది: 29.04.2022

ఒకరు కాదు ఇద్దరు మెగా టాప్ హీరోలు న‌టించిన సినిమా కావ‌డంతో ‘ఆచార్య’పై మంచి అంచ‌నాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. .కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మెగాఫ్యామిలీ డ్రీమ్‌ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆచార్య’. తొలిసారి రామ్‌ చరణ్‌ పూర్తిస్థాయిలో చిరంజీవితో కలిసి నటిస్తున్న చిత్రమిది. అందుకే ఈ మూవీ కోసం మెగా అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూశారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌, పాటలు సినిమాపై పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘ఆచార్య’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆచార్య’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం.

కథ :

ధర్మస్థలి.. 800 ఏళ్ల చరిత్ర ఉన్న టెంపుల్‌ టౌన్‌ అది. పక్కనే జీవధార నది. దానికి అటువైపు పాదఘట్టం అనే చిన్న తండా.  అక్కడి ప్రజలకు ధర్మస్థలి టెంపుల్‌తో ఎనలేని సంబంధం ఉంటుంది. ధర్మస్థలిలో ఉండే ప్రజలకు ఆయుర్వేద వైద్యం చేస్తూ.. ధర్మంగా ఉంటారు పాదఘట్టం తండా వాసులు. కానీ ధర్మస్థలి మున్సిపల్‌ చైర్మన్‌ బసవన్న(సోనూసూద్‌) చాలా క్రూరుడు. ధర్మస్థలి టెంపుల్‌లో అసాంఘిక కార్యక్రమాలను కొనసాగిస్తూ.. అక్కడి సొమ్మునంతా కాజేస్తాడు. రాజకీయంగా ఎదగడం కోసం.. ధర్మస్థలి అమ్మవారి టెంపుల్‌తో పాటు పాదఘట్టం గ్రామాన్ని కూడా మైనింగ్‌ మాఫియా లీడర్‌ రాథోడ్‌ (జిషు సేన్‌ గుప్తా)కు అప్పగించే ప్రయత్నం చేస్తాడు. ఇలా ధర్మస్థలిలో అధర్మం పేట్రేగిపోతుండడంతో దాన్ని అడ్డుకోవడానికి అధర్మం రాజ్యం వెళ్తున్న క్రమంలో గ్రామానికి ఆచార్య (చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవన్న గ్యాంగ్‌ చేసే అరాచకాలను ఒక్కొక్కటిగా ఎండగడుతూ ఉంటాడు. అసలు ఆచార్య ఎవరు? ధర్మస్థలిలో నీలాంబరి (పూజా హెగ్డే) ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది? ధర్మస్థలి పక్కనే ఉన్న పాద ఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ద (రామ్‌ చరణ్‌) ఏమైపోయాడు? అసలు సిద్ధ ఎవరు? సిద్ధాకి ఆచార్యకి మధ్య ఉన్న బంధం ఏమిటి? చివరకు ఆచార్య ధర్మస్థలిలో ధర్మాన్ని ఎలా నిలబెట్టాడు? అనేది మిగతా కథ.

నటీనటుల హావభావాలు :

ఎలాంటి పాత్రలోనైనా నటించడం కంటే జీవించేయడం మెగాస్టార్‌ స్పెషాలిటీ. ‘ఆచార్య’గా  తనదైన నటనతో చిరంజీవి అదరగొట్టేశాడు. ఫస్టాఫ్‌ అంతా కథని తన భూజాన వేసుకొని నడిపించాడు. ఫైట్స్‌ సీన్స్‌తో పాటు డ్యాన్స్‌ కూడా ఇరగదీశాడు. ముఖ్యంగా లాహే లాహే పాటతో పాటు స్పెషల్‌ సాంగ్‌కి చిరు అదిరిపోయే స్టెప్పులేసి అలరించాడు. ‘భలే భలే బంజారా’ సాంగ్‌కి రామ్‌ చరణ్‌తో చిరు వేసే స్టెప్పులైతే మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక సిద్ధ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు రామ్‌ చరణ్‌. ప్రతి సీన్‌లోనూ చిరంజీవితో పోటీపడీ నటించాడు. డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెకండాఫ్‌లో సింహభాగం సిద్ధ పాత్రదే. సిద్ధని ప్రేమించే యువతి, సంగీతం టీచర్‌ నీలాంబరి పాత్రలో ఒదిగిపోయింది పూజాహెగ్డే. కాకపోతే సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. నిడివి కూడా చాలా తక్కువే. ఇక విలన్‌గా సోనూసూద్‌ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. మైనింగ్‌ మాఫియా లీడర్‌ రాథోడ్‌గా జిషు సేన్‌ గుప్తా, పాదఘట్టంలోని ఆయుర్వేద వైద్యుడు వేదగా అజయ్‌ చక్కటి నటనను కనబరిచారు. కామ్రేడ్‌ శంకర్‌ అన్నగా సత్యదేవ్‌ చాలా బాగా నటించాడు. ఆయన పాత్ర నిడివి చాలా తక్కువే అయినా.. సినిమాకి కీలకం. నాజర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతికవర్గం పనితీరు :

కమర్షియల్‌ అంశాలకు సందేశాన్ని జోడించి సక్సెస్‌ సాధించిన కొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ‘మిర్చి’ మొదలు..‘ భరత్‌ అనే నేను’వరకు ఆయన తీసిన నాలుగు సినిమాలన్నీ సూపర్‌ హిట్టే. అలాంటి దర్శకుడు చిరంజీవి, రామ్‌ చరణ్‌ లాంటి స్టార్‌ హీరోలతో సినిమా తీస్తే. ప్రేక్షకుల అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. కొత్త కథని ఆశిస్తారు. కానీ కొరటాల మాత్రం ప్రేక్షకులకు పాత కథే చూపించాడు. అది కూడా అంతగా ఆసక్తిగా సాగలేదు. కథ, కథనం, మాటలు ఇలా ప్రతి అంశంలోనూ కొరటాల తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఒకానొక దశలో అసలు ఇది కొరటాల శివ సినిమానేనా అన్న అనుమానం సగటు ప్రేక్షకుడికి కలగక మానదు కథను పక్కకు పెట్టి.. స్టార్‌ క్యాస్ట్‌ మీదే ఎక్కువ ఆధారపడ్డాడు డైరెక్టర్‌. మహేశ్‌ బాబు వాయిస్‌ ఓవర్‌తో ధర్మస్థలి నేపథ్యాన్ని చెప్పించి కథను ప్రారంభించాడు దర్శకుడు.

ఆచార్య ధర్మస్థలిలోకి అడుగుపెట్టడం.. బసవన్న ముఠా చేసే అరాచాకాలను ఎండగట్టడం, రెండు పాటలతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. మణిశర్మ సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అయితే సినిమాలో స్లోగా సాగే సీన్స్ ను సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. పాటల పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి. 

విశ్లేషణ :

ఆచార్య చేసే పోరాట ఘట్టాలు చాలానే ఉన్నప్పటికీ... కథపై ప్రేక్షకుడికి అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్‌ ముందు సిద్ధ పాత్ర ఎంటర్‌ అవుతుంది. దీంతో సెకండాఫ్‌పై కాస్త ఆసక్తి పెరుగుతుంది. కానీ అక్కడ కూడా ప్రేక్షకులను నిరాశపరిచాడు కొరటాల. ఆచార్య, సిద్ధ మధ్య వచ్చే సీన్స్‌ మినహా మిగతాదంతా సింపుల్‌గా సాగుతుంది. కథలో ఎలాంటి ట్విస్టులు ఉండవు. అయితే నక్సలైట్స్‌గా సిద్ద, ఆచార్య చేసే పోరాట ఘట్టాలు మాత్రం ఆకట్టుకుంటాయి. అత్యంత భారీ అంచనాలతో వచ్చిన ఈ భారీ మెగా ఎమోషనల్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్.. ఆ అంచనాలను అందకోలేక పోయింది. కాకపోతే, మెయిన్ కథాంశం, మెగాస్టార్, మెగా పవర్ స్టార్ స్క్రీన్ ప్రేజన్సీ బాగా ఆకట్టుకున్నాయి. అయితే, రొటీన్ సీన్స్ తో స్లోగా సాగే ప్లే, అక్కడక్కడ బోరింగ్ ట్రీట్మెంట్, ఇక బలం లేని మెయిన్ సీక్వెన్స్ స్.. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ చిత్రం సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది. మెగా అభిమానులకు మాత్రం ఈ చిత్రం నచ్చుతుంది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :