ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఉద్య‌మాల దిక్సూచి డాక్ట‌ర్ కడియం రాజు కు అమెరికాలో శ్రద్ధాంజలి కార్యక్రమం

ఉద్య‌మాల దిక్సూచి డాక్ట‌ర్ కడియం రాజు కు అమెరికాలో శ్రద్ధాంజలి కార్యక్రమం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ డాక్ట‌ర్ కడియం రాజు గారి శ్రద్ధాంజలి సభ అమెరికాలో న్యూ జెర్సీ రాష్ట్రములో బ్లూ ఫాక్స్ రెస్టారెంట్ లో నిర్వహించడం జరిగింది.

ఈ శ్రద్ధాంజలి కార్యక్రమనికి మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎన్ రామచంద్ర రావు గారితో పాటు, ఏబీవీపీ పూర్వ విద్యార్థులు శ్రీకాంత్ తుమ్మల, విలాస్ రెడ్డి  జంబుల, సంతోష్ కోరం, కృష్ణ రెడ్డి ఏనుగుల, శంకర్, కృష్ణమోహన్, రామ్ వేముల, శరత్ వేముల, రఘ్వువీర్ రెడ్డి, ప్రదీప్ కట్ట, గోపి సముద్రాల, వంశీ, రఘు, మధుకర్, పూర్వ కార్యకర్తలు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, స్వర్గీయ డా. కడియం రాజన్న ఆత్మీయ మిత్రులు పెద్ద ఎత్తున హాజరై కడియం రాజన్న గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

ఉస్మానియా పూర్వ విద్యార్థి ,అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్  నాయకుడు ,తన ఉద్యమాల ద్వారా ఎందరికో ఆదర్శం గా నిలిచిన జాతీయ స్థాయి లీడర్, కడియం రాజు  మాకు  (విలాస్ రెడ్డి  జంబుల ,శ్రీకాంత్ తుమ్మల  ) సహచరుడు కావడం మా పూర్వ జన్మ సుకృతం. విలాస్ రెడ్డి జంబుల అనే నేను ఈ రోజు ఇలా అమెరికాలో ఉన్నత స్థాయిలో ఉన్నాను అంటే దాని కి  కారణం మనం అందరం ముద్దుగా పిలుచుకునే ఉస్మానియా దిక్సూచి కడియం రాజు అని సగర్వంగా చెబుతాను. నాలాంటి ఎంతో మంది శ్రీకాంత్ రెడ్డి తుమ్మలకు అయన ఒక సింహ స్వప్నం.   ఒక సిద్ధాంతం కోసం , తనని నమ్ముకున్న వారి కోసం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టైనా పోరాడే యోధుడితో కలిసి చదివే అవకాశం వచ్చినందుకు ,ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు  ఎప్పుడూ గర్వంగా ఉంటుంది.

దేశ భక్తి , సేవాభావం ,ఉద్యమస్ఫూర్తి ,నాయకత్వ లక్షణాలు ,పోరాడేతత్వం ఇవన్నీ కలగలిపిన ఆదర్శ వ్యక్తి  కడియం రాజు .అసలు ఎవరు ఈ రా"రాజు"  , అయన గురించి , ప్రజలను చైతన్య పరిచిన అయన విధానాలు గురించి ,ఒక్క మాటలో చెప్పాలంటే అయన ప్రయాణం గురించి మా  మాటల్లో.....,కాదు కాదు ,మా లాగా అభిమానించే ఎంతోమంది కోసం  ఆయన ప్రయాణం  గురించి వారి మాటల్లో

దేశాన్ని ప్రేమించే జాతీయ భావాలు కలిగిన విద్యార్థి..
ఉస్మానియా క్యాంపస్‌లో ఉద‌యించిన‌ ఉద్యమ నేత..
స‌మాజాన్ని ప్రేమించే న‌వ‌త‌రం నాయ‌కుడు..
ఎంతో భ‌విష్య‌త్ ఉన్న ఆ డైన‌మిక్ లీడ‌ర్‌ను విధి కాటేసింది..
స‌మాజం చిన్న‌బోయేలా ఒక నాయ‌కుడిని కోల్పోయింది..
ప్ర‌జ‌ల కోసం ఆయ‌న చేసిన‌ ఉద్య‌మాల‌ను ఆయ‌న ఆద‌ర్శ వ్య‌క్తిత్వం గుర్తు తెచ్చుకుని త‌ల్ల‌డిల్లుతున్నారు ఎంతో మంది..

ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ చరిత్రలో 108 రోజుల జైలు జీవితం గడిపి, అన్న, బాబాయ్, మామగా విద్యార్థులచే ముద్దుగా పిలుచుకునే ఉస్మానియా యూనివర్సిటీ దిక్సూచి డాక్ట‌ర్ కడియం రాజు ఇటీవ‌ల‌ మార్చి 20న అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయన నల్లగొండ జిల్లాలోని కొత్తగూడెం గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. తన పాఠశాల విద్య కొండ్రపోల్ గ్రామంలో, ఇంటర్ నాగార్జున జూనియర్ కళాశాల, మిర్యాలగూడ కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తిచేశారు. పేదరికం వెక్కిరిస్తున్నా ఆ తర్వాత ఎంఏ హిస్టరీ విభాగంలో ఎంఫిల్, పీహెచ్‌డీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేశారు. ఆయనకు ఇంటర్ నుంచే దేశభక్తి, జాతీయ భావాలు కలిగిన విద్యార్థిగా ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ డిగ్రీలో కళాశాల ఎబీవీపీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2002 సంవత్సరం నుండి ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ సైద్ధాంతిక పోరులో ముందుండి క్రియాశీలకంగా పనిచేశారు. ఏబీవీపీ చేపట్టిన ఎన్నో విద్యారంగ సమస్యలపై ముందుండి పోరాడి, ఎన్నో లాఠీ దెబ్బలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి 108 రోజులు జైలు పాలయ్యారు.

కుట్ర‌ల‌ను, అవినీతిని స‌హించ‌ని వ్య‌క్తిత్వం ఆయ‌న‌ది. ఏబీవీపీ చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ భూముల పరిరక్షణ ఉద్యమంలో ముందుండి, అనేక ఆక్రమణ భూముల విషయంలో కోర్టులలో కేసులు వేశారు, నిరుద్యోగం, విద్యారంగ సమస్యలు మెస్‌ బిల్లులు, స్కాలర్‌షిప్పులు, మౌలిక వసతులు, నూతన హాస్టళ్ల నిర్మాణం కోసం పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు.

ఏబీవీపీలో డాక్ట‌ర్ కడియం రాజు తన సుదీర్ఘ ప్రయాణంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంచార్జ్‌గా, సిటీ సెక్రెటరీగా, స్టేట్ సెక్రెటరీగా, నేషనల్ సెక్రెటరీగా, సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా అనేక విద్యార్థి ఉద్యమాలకు నేతృత్వం వహించారు. అలాగే జాతీయ ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల విద్యా నియంత్రణ కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో సైతం ఏబీవీపీ చేపట్టిన అనేక ఉద్యమాలను ముందుండి నడిపించారు. ఏబీవీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన లక్ష మందితో ‘తెలంగాణ రణభేరి’లో సుష్మాస్వరాజ్ ఆహ్వానించిన సభకు సభాధ్యక్షత వహించారు. అలాగే ఏబీవీపీ తెలంగాణ సాధనకై మహా పాదయాత్రలో కోదాడ నుండి హైదరాబాద్ వరకు నేతృత్వం వహించారు. నా రక్తం- నా తెలంగాణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, ఉస్మానియా యూనివర్సిటీ‌లో విద్యార్థుల నిరాహార దీక్షలు... ఇలా తెలంగాణ సాధనలో అనేక ఉద్యమాలలో క్రియాశీలకంగా పోరాడారు.

ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పడితే మీ కలలుగన్న వ్యవస్థ వస్తుందా? ఆంధ్ర ప్రాంతం వారు వెనక్కి వెళ్లిపోవాలా అని పాత్రికేయులు అడిగిన‌ ప్రశ్నలకు ‘ముందు ప్రజలు చైతన్యవంతం కావాలి. మేము కోరుకొంటున్న తెలంగాణ హింసా, రక్తపాతాలకు తావీయని సస్యశ్యామలమైన తెలంగాణ కావాలని. ప్రతీ రాజకీయ పార్టీ తన వైభవాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ ప్రజలు చైతన్యవంతం అయితే సరైన నాయకులను ఎన్నుకొని సరైన ప్రభుత్వాలను ఏర్పరచుకుంటారు. ఇందుకోసం అందరిని జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ వంతుగా మా ప్రయత్నం చేస్తాం. కానీ రాష్ట్రం ఏర్పడితే ఎవరూ బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరూ అభద్రతాభావానికి లోనూ కాకుండా ఇక్కడే ఉండవచ్చు. ఏవైనా కొన్ని దుష్టశక్తులు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే ప్రయత్నం చేస్తే, ఏబీవీపీ లాంటి జాతీయవాద సంస్థలు అలాంటి శక్తులకు తగిన బుద్ధిచెప్తాయి’. అంటూ స్పష్టంగా బదులివ్వడం డాక్ట‌ర్ కడియం రాజు త‌న‌ ఆదర్శ నాయకత్వానికి మచ్చుతునక.

జాతీయ భావాలు కలిగిన దేశభక్తుడిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన డాక్ట‌ర్ కడియం రాజు మరణం విద్యార్థి లోకానికి, దేశానికి తీరని లోటు. ఆయ‌న భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయినా ప్ర‌జ‌ల కోసం ఆయ‌న చేసిన‌ ఉద్య‌మాల‌ను ఆయ‌న వ్య‌క్తిత్వం అంద‌రికీ ఆద‌ర్శం, మ‌రెంతో మందికి స్పూర్తి.

 

Click here for Photogallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :