Vijayawada court : విజయవాడ కోర్టుకు హాజరైన ఏపీ, తెలంగాణ నేతలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబులాపురం(Obulapuram) గనుల్లో 2007 జులై 21న అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లిన వారిపై నమోదైన కేసుకు సంబంధించిన విచారణను విజయవాడ లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు (Vijayawada court) వచ్చే ఏడాది జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. 21 మందిపై కేసు నమోదు చేయగా, అందులో ముగ్గురు కేసు విచారణ దశలో ఉండగానే మృతి చెందారు. మిగిలిన అందరూ ఇవాళ విచారణకు హాజరుకావాల్సిందేనని గత విచారణ సమయంలో న్యాయాధికారి ఆదేశించారు.
దీంతో అభియోగాలు నమోదైన ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నాగం జనార్ధన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, దేవినేని ఉమామహేశ్వరావు, నిమ్మకాలయ చినరాజప్ప, పడాల అరుణ, అమర్‌నాథ్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చిన్న బాబురమేష్, కోళ్ల లలితకుమారి, బొమ్మడి నారాయణరావు, మసాల పద్మజ, పూల నాగరాజు, ముల్లంగి రామకృష్ణారెడ్డి, గురుమూర్తి, మెట్టు గోవిందరెడ్డి, యలమంచిలి బాబూరాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి ముందు హాజరయ్యారు. 2007 జులై 21న అనంతపురం(Anantapur) జిల్లా డి.హీరేహళ్ మండలంలోని ఓబులాపురం ఇనుప గనుల పరిశీలనకు అప్పటి తెలుగుదేశం (TDP) నేతలు ఓ బృందంగా వెళ్లినప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు.