YS Jagan: అదే స్క్రిప్టు.. అదే పంథా.. మారని జగన్ స్టైల్..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) ఇవాళ పలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాడేపల్లిలో (Tadepalli) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడిపై (CM Chandrababu) తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతను దిగజార్చారని, అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే జగన్ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన ఇంకా గతం నుంచి బయటకు వచ్చినట్లు కనిపించట్లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ప్రజల తీర్పును గుర్తించకుండా ఇంకా తన పాలనే గ్రేట్ అనుకుంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అటు కేడర్‌ను, ఇటు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు. ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. హామీలు అమలు చేయకపోవడంతో వ్యతిరేకత పెరుగుతోంది అని జగన్ విమర్శించారు. అదే సమయంలో తమ పార్టీ మాత్రం కోవిడ్ సంక్షోభంలోనూ మ్యానిఫెస్టో హామీలను నెరవేర్చిందని, పథకాలను సమర్థవంతంగా అమలు చేసిందని చెప్పుకొచ్చారు. మాట తప్పలేదు, విలువలు వదల్లేదు అని జగన్ పేర్కొన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇంత చేసినా కూడా జగన్ ను ప్రజలు దారుణంగా ఓడించారు. కానీ జగన్ దాన్ని అంగీకరించకుండా తనే గొప్ప అన్నట్టు ఇప్పటికీ ఫీలవుతున్నారు.
వైసీపీ కార్యకర్తలు ప్రస్తుత ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని రక్షించేందుకు ‘జగన్ 2.0’లో ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన అధికారులను, పోలీసులను సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు జగన్ ఇంకా పాత స్క్రిప్ట్ నే ఫాలో అవుతున్నట్టు తెలియజేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందింది. జగన్ పరిపాలనపై అసంతృప్తి, హామీల అమలులో వైఫల్యం, అవినీతి ఆరోపణలు ఈ ఓటమికి కారణాలు. అయినా, జగన్ తన పరిపాలనను గొప్పగా చిత్రీకరిస్తూ, ప్రజల తీర్పును అర్థం చేసుకోలేకపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
జగన్ ప్రస్తుత రాజకీయ కార్యకలాపాలు కూడా విమర్శలకు తావిస్తున్నాయి. వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటున్నారు. మిగతా సమయం బెంగళూరులో గడపడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శలు వస్తున్నాయి. ప్రజల మధ్య ఎక్కువ సమయం గడపడం, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం కన్నా, కేడర్‌ను ఉత్సాహపరిచే ప్రసంగాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. జగన్ తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. పాత ఆరోపణలు, విమర్శలు కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి సారించి, నిర్మాణాత్మక రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని చెప్తున్నారు.