Electricity Deals: ఏపీలో విద్యుత్ ఒప్పందాలపై రాజకీయ రగడ..!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కొనుగోలు (Electricity) ఒప్పందాలు రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ప్రస్తుత TDP ప్రభుత్వం యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో (Axis Energy Ventures Pvt Ltd) యూనిట్‌కు రూ.4.60 వద్ద విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందని YSRCP ఆరోపిస్తోంది. తమ హయాంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) ద్వారా యూనిట్‌కు రూ.2.49కే విద్యుత్ కొనుగోలు చేసినప్పటికీ, TDP అప్పట్లో దాన్ని తప్పుబట్టిందని YSRCP పేర్కొంది. ఈ ఒప్పందాలపై రెండు పార్టీలు తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.
YSRCP హయాంలో SECIతో 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఒక్కో యూనిట్‌కు రూ.2.49 చెల్లించేలా ఈ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం వెనుక అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు TDP ప్రభుత్వం యాక్సిస్ ఎనర్జీతో కొత్త ఒప్పందం కుదుర్చుకుందని YSRCP ఆరోపిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం యూనిట్‌కు రూ.4.60 ప్రభుత్వం చెల్లించనుంది. ఇది వైసీపీ ప్రభుత్వం SECIకి చెల్లించిన ధర కంటె రెట్టింపు. దీన్ని YSRCP విమర్శిస్తోంది.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం SECIతో చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనాలను తెచ్చిపెట్టిందని, అయినప్పటికీ TDP అప్పట్లో దానిపై అవాస్తవ ఆరోపణలు చేసిందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. గతంలో SECI ఒప్పందం వెనుక భారీ అవినీతి జరిగిందని టీడీపీ ఆరోపించింది. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నివేదికను ఇందుకు ఉదాహరణగా చూపించారు. అయితే SECI విద్యుత్ కొనుగోలుకు APERC ఆమోదం తెలిపింది. దీనిని YSRCP తమ నిర్ణయం సరైనదని నిరూపించే అంశంగా చూపిస్తోంది. ఇప్పుడు TDP ప్రభుత్వం యాక్సిస్ ఎనర్జీతో అధిక ధరకు ఒప్పందం చేసుకుందని వైసీపీ విమర్శిస్తోంది. దీని వెనుక అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది.
అయితే YSRCP ఆరోపణలను TDP నాయకులు తిప్పికొడుతున్నారు. యాక్సిస్ ఎనర్జీతో ఒప్పందం YSRCP హయాంలోనే కుదిరిందని, దానిని రద్దు చేసే అవకాశం లేకుండా ఆ ఒప్పందం రూపొందించబడిందని వాదిస్తున్నారు. తప్పు చేసి వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని టీడీపీ నేతలు దుయ్యబడుతున్నారు. మొత్తానికి ఈ విద్యుత్ ఒప్పందాలపై వివాదాలు చుట్టుముడుతున్నాయి. TDP ప్రభుత్వంపై YSRCP ఈ ఆరోపణలను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో YSRCP గత పాలనలోని వైఫల్యాలను TDP హైలైట్ చేస్తోంది. అయితే యాక్సిస్ ఎనర్జీ ఒప్పందంపై ఏపీ ప్రభుత్వం ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు.