Mahanadu: జగన్ కంచు కోటలో టీడీపీ మహానాడు వేడుకలకు ఘన ఏర్పాట్లు..

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party ) మహానాడు వేడుకలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ మహాసభలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ప్రతి ఏడాది జరిగే మహానాడు కార్యక్రమానికి ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. టీడీపీ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ జరగని విధంగా కడప (Kadapa) జిల్లా వేదికగా మహానాడు నిర్వహించనున్నారు. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధినేత జగన్ (Jagan) కి సొంత జిల్లా కావడంతో, ఈ పరిణామం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
చాలా కాలంగా కడపలో టీడీపీ పెద్దగా బలంగా లేదు. అయినా ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత పార్టీ ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం వెనుక వ్యూహాత్మక ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలం క్రితం జగన్ సొంత నియోజకవర్గం అయిన పులివెందుల (Pulivendula)లోనే మహానాడు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆ ప్రణాళికను వదిలిపెట్టి, కడప జిల్లా సీకే దిన్నె మండలం (CK Dinne Mandal) పరిధిలోని చెర్లోపల్లి (Cherlopalli), పబ్బవరం (Pabbavaram) గ్రామాల మధ్య ఉన్న విస్తృత భూమిలో మహానాడు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రాంతం రవాణాకు అనుకూలంగా ఉండటం, తిరుపతి (Tirupati), అనంతపురం (Anantapur), చిత్తూరు (Chittoor), హైదరాబాద్ (Hyderabad) వంటి ప్రధాన ప్రాంతాలనుంచి సులభంగా చేరుకోగలగడం వల్లే ఈ స్థలాన్ని ఎంపిక చేశారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే అక్కడి స్థలాన్ని పరిశీలించి, మే 7వ తేదీన భూమిపూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వేడుకల ఏర్పాట్లు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈసారి మహానాడు టీడీపీకి (TDP) చాలా ప్రత్యేకం కాబోతుంది. నాలుగోసారి అధికారంలోకి వచ్చిన పార్టీ, మెజారిటీతో సాధించిన ఘన విజయానంతరం నిర్వహిస్తున్న తొలి మహానాడు కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. ఈ వేడుకల్లో దాదాపు పది లక్షల మంది హాజరయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఇక అమరావతి (Amaravati) నిర్మాణ పునఃప్రారంభం, రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కార్యాచరణ నేపథ్యంలో, మహానాడు ద్వారా ప్రజల్లోకి బలమైన సందేశం వెళ్లేలా చూడాలన్న లక్ష్యం ఉంది. పులివెందులలో సరైన స్థలం అందుబాటులో లేకపోవడం వల్లే అక్కడ మహానాడు నిర్వహించలేకపోయారని చెబుతున్నారు. కడపలో నిర్వహించే మహానాడు టీడీపీకి ఒక్క జిల్లాకే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఊపు తీసుకురావాలని నాయకత్వం భావిస్తోంది. ఇక ఈ మహానాడు రాజకీయంగా ఏ మేరకు ప్రభావం చూపుతుందో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.