Supreme Court: ఏపీ లిక్కర్ స్కాం పై సుప్రీం కోర్ట్ సంచలన ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) లిక్కర్ స్కాం వ్యవహారంలో రోజురోజుకీ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలక నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. లిక్కర్ స్కాంలో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ స్కామ్ లో మధ్యవర్తిగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి ఒక్కడే 2300 కోట్ల రూపాయలు దోచినట్లు కూడా గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక లిక్కర్ స్కాంలో ముడుపులు వివిధ రూపాల్లో పెద్దలకు చేరినట్లుగా కూడా విచారణలో వెల్లడైంది.
బంగారం బిస్కెట్ల రూపంలో, డబ్బు రూపంలో అలాగే మైనింగ్ రూపంలో విదేశాలకు తరలించారని అలాగే విదేశాల్లో.. యూరప్ ను మనీలాండరింగ్ కు ఎంచుకున్నట్లుగా కూడా గుర్తించారు. ఇక ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ లిక్కర్ స్కాంలో కీలకంగా భావిస్తున్న ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టు లో చుక్క ఎదురయింది. జగన్(Ys Jagan) మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప కు మద్యంతర ఉపశమనానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
హైకోర్టులో ఏడవ తేదీన విచారణ ఉన్నందున జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. చట్టపరంగా ముగ్గురిని అదుపులోకి తీసుకోవచ్చని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది. అదేరోజు ఎంపీ మిధున్ రెడ్డి బెయిల్ పై కూడా విచారణ జరుపుతామని పేర్కొంది. లిక్కర్ స్కాం లో వీరి ముగ్గురు అత్యంత కీలకంగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని అరెస్టు చేసి విచారిస్తే కీలక వ్యక్తుల పేర్లు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం నాలుగు రోజుల నుంచి విచారిస్తున్న సంగతి తెలిసిందే.