AP Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు… కీలక నిందితులకు నోటీసులు..!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) తన దర్యాప్తును మరింత తీవ్రతరం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) పాలనలో 2019-2024 మధ్య మద్యం కుంభకోణం జరిగిందని.. రూ.3,200 కోట్లకు పైగా ముడుపుల రూపంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్ట్ చేసిన సిట్, తాజాగా హైదరాబాద్‌లో మరో ముగ్గురు నిందితులైన కృష్ణమోహన్ రెడ్డి (Krishnamohan Reddy), ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy), బాలాజీ గోవిందప్పల (Balaji Govindappa) నివాసాలు, కార్యాలయాలకు వెళ్లి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11న ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల ముందస్తు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి, దీంతో వారికి అరెస్ట్ భయం నెలకొంది.
వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ద్వారా అమలు చేసిన మద్యం పాలసీలో భారీ అవినీతి జరిగినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుంభకోణంలో నెలకు రూ.50-60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి, వాటిని హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలోని హవాలా నెట్‌వర్క్ ల ద్వారా మళ్లించినట్లు సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ లావాదేవీలను దాచిపెట్టేందుకు నకిలీ జీఎస్టీ ఇన్‌వాయిస్‌లు, వీపీఎన్‌లు, అంతర్జాతీయ వర్చువల్ నంబర్‌లను ఉపయోగించినట్లు ఆధారాలు సేకరించింది. ఈ కేసులో షెల్ కంపెనీల ద్వారా డబ్బును మళ్లించడం, బంగారం కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్ కంపెనీలకు బదిలీ చేయడం వంటి మనీలాండరింగ్ కార్యకలాపాలు జరిగినట్లు సిట్ నిర్ధారించింది.
సిట్ ప్రాథమిక దర్యాప్తులో మద్యం పాలసీ రూపకల్పనలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు తేలింది. అలాగే మాజీ సీఎం జగన్ కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలు మద్యం కంపెనీల యజమానులతో హైదరాబాద్, తాడేపల్లిలో పలు సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశాల్లో ముడుపుల శాతాలు, సరఫరా ఒప్పందాల గురించి చర్చించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. వసూలు చేసిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా మళ్లించి, అంతిమంగా ఎవరి ఖాతాకు చేరిందనే విషయంపై సిట్ ఇంకా లోతైన దర్యాప్తు చేస్తోంది.
ఈ కేసులో సిట్ ఇప్పటివరకు పలువురు కీలక నిందితులను అరెస్ట్ చేసింది. ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కెసిరెడ్డి (Raj Kasireddy) ఈ కేసులో కింగ్‌పిన్‌గా పరిగణించబడుతున్నాడు. రాజ్ కెసిరెడ్డితో కలిసి ముడుపుల సేకరణలో కీలక పాత్ర పోషించిన బుసిరెడ్డి చాణక్యను (Busireddy Chanakya) అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. ఇక SPY ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి (Sajjala Sridhar Reddy) మద్యం పాలసీ సమావేశాల్లో మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈయన కూడా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయి రెడ్డి ఇప్పటికే పలుమార్లు సిట్ విచారణకు హాజరయ్యారు.
సిట్ ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, అరెస్ట్ అయిన నిందితుల స్టేట్‌మెంట్లు, రాజ్ కెసిరెడ్డి, చాణక్యల రిమాండ్ రిపోర్టుల ఆధారంగా ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ కుంభకోణంలో జాతీయ స్థాయి మద్యం బ్రాండ్‌లను తొలగించి, స్థానిక, కొత్త బ్రాండ్‌లకు అవకాశం కల్పించడం ద్వారా మార్కెట్‌ను ఆధీనంలోకి తీసుకున్నట్లు సిట్ వెల్లడించింది. అయితే.. ఈ కుంభకోణంలో ముడుపులు అంతిమంగా ఎవరి ఖాతాకు చేరాయనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సిట్ దర్యాప్తు ఈ దిశగా ముందుకు సాగుతోంది.