Modi – CBN: నా కంటే చంద్రబాబే తోపు.. మోదీ పొగడ్తల వర్షం..!!

ప్రపంచంలోనే శక్తివంతమైన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పేరొందారు. ఇక దేశంలో ఆయన్ను టచ్ చేసే నేత దరిదాపుల్లో లేరు. వరుసగా మూడు సార్లు ప్రధాని పదవి చేపట్టి ఆయన సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. దేశంలో నేతలంతా ఆయన ప్రాపకంకోసం పాకులాడుతున్నారు. ఇక ఏపీలో టీడీపీ నేత చంద్రబాబు (CM Chandrababu) అయితే నరేంద్ర మోదీని ఏ స్థాయిలో పొగుడుతున్నారో అందరికీ తెలిసిందే. ఎన్డీయేలో (NDA) కీలక భాగస్వామి అయిన చంద్రబాబు.. ప్రధాని మోదీకి చుక్కలు చూపెడుతారని అందరూ అనుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం మోదీని అవకాశం చిక్కినప్పుడల్లా పొగుడుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అయితే ఈసారి చంద్రబాబుపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించడం మరింత ఆశ్చర్యపరిచింది.
అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ వేదికపై ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పొగడ్తలతో ముంచెత్తారు. మోదీని టచ్ చేసే నేత ఎవరూ లేరన్నారు లోకేశ్. ఇక చంద్రబాబు కూడా ప్రధాని మోదీ అండదండలతో ఏపీ పురోగమిస్తుందన్నారు. దేశం సరికొత్త శిఖరాలకు వెళ్తుందన్నారు. వీళ్లందరూ మాట్లాడిన తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆయన ఈసారి ఏం మాట్లాడతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.
ఏపీకి కేంద్రం అందిస్తున్న అండదండలు, ఏపీకోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ పడుతున్న కష్టం.. ఇలా అన్ని విషయాలపై ఆయన మాట్లాడారు. ఏపీ అన్ని రంగాల్లో పురోగమించేందుకు అండదండలు అందిస్తామన్నారు. ఇవన్నీ సహజంగా ఎప్పుడూ మాట్లాడేవే. అయితే ఈసారి ప్రధాని మోదీ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. మీకో సీక్రెట్ చెపుతా వినండి అంటూ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. టెక్నాలజీ తనతోనే మొదలైనట్లు చంద్రబాబు చెప్పారని, అది కరెక్ట్ కాదన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో చంద్రబాబు ఏం చేస్తున్నారు.. ఏ టెక్నాలజీ వాడుతున్నారు.. లాంటి విషయాలను హైదరాబాద్ కు అధికారులను పంపించి తెలుసుకున్నానన్నారు. టెక్నాలజీలో చంద్రబాబే తనకు మార్గదర్శి అని స్పష్టం చేశారు.
అంతేకాదు.. దేశంలో ఏవైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులను పట్టుకోవాలన్నా, వాటిని తొందరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబు ఒక్కడికే సాధ్యమన్నారు. అది కూడా క్వాలిటీతో చేయడం చంద్రబాబు స్పెషాలిటీ అన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ లక్ష్యమని.. దాన్ని మనం సాకారం చేయాలని చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు సూచించారు. మనం చేయాలి.. మనమే చేయాలి అని నొక్కి చెప్పారు. వచ్చే నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి తాను హాజరవుతానని మాటిచ్చారు. మొత్తంగా చంద్రబాబును మోదీ పొగడడం ఈ సమావేశానికి హైలైట్ గా నిలిచింది.