Nara Lokesh: అమరావతి పునర్నిర్మాణ సభలో జోష్ నింపిన నారా లోకేష్ స్పీచ్..

ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి (Amaravati) పునర్నిర్మాణ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రత్యేక విమానంలో తిరువనంతపురం (Thiruvananthapuram) నుంచి బయల్దేరి అమరావతి 2.0 వేదికకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. సభలో ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
నారా లోకేష్ తన ప్రసంగాన్ని “అమరావతి నమో నమః” అంటూ ప్రారంభించారు. అనంతరం పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి ఘటనను ప్రస్తావిస్తూ భారత ప్రధాని మోడీ చూపిన ధైర్యాన్ని గుర్తు చేశారు. మోడీ నాయకత్వంతో దేశం మరింత శక్తివంతంగా మారిందని, ఒక్క పాకిస్థాన్ (Pakistan) కాదు, వంద పాకిస్థాన్లు వచ్చినా మన దేశాన్ని ఏమి చేయలేవని చెప్పిన లోకేష్… మోడీని ‘భారత మిస్సైల్’ (India’s Missile) అంటూ అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలకు సభా ప్రాంగణం కరతాళధ్వనులతో మారుమోగింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పై మోడీకి ప్రత్యేక ప్రేమ ఉందని అన్నారు లోకేష్. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఆయన మద్దతు అందిస్తున్నారని చెప్పారు. 2014లో ఏపీకి రాజధాని లేకుండానే విడిపోయామని, కానీ చంద్రబాబు నాయుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని వివరించారు. కష్టకాలాలు చంద్రబాబుకు కొత్తవేమీ కాదని అన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో అమరావతి గురించి ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారో గుర్తు చేస్తూ, అప్పట్లో అమరావతి రైతులు ఎంత స్థైర్యంగా నిలబడ్డారో వివరించారు. వారు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ ‘జై అమరావతి’ (Jai Amaravati) నినాదాన్ని నిలబెట్టారని చెప్పారు. నిర్భందాలు, కేసులు, కుట్రలు అన్నింటినీ తట్టుకొని రైతులు చూపిన ధైర్యానికి తల వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.
అమరావతి అనేది ఎవరి ఇంట్లో పెంచిన మొక్క కాదని, అది ప్రజల గుండెల్లో దాచిన రాజధాని అని భావోద్వేగంతో చెప్పారు. చివరగా, అమరావతి అన్ స్టాపబుల్ (Amaravati Unstoppable) అంటూ ముగించడంతో సభలో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఈ స్పీచ్ తమ్ముళ్లలో ఉత్సాహాన్ని నింపింది. నారా లోకేష్ ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.