Jammu and Kashmir: కశ్మీర్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల రక్షణపై స్పందించిన..లోకేష్

భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకీ తీవ్రమవుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య దేశం మొత్తంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో గల ప్రజలు, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో విద్యార్థులే ఎక్కువగా బాధపడుతున్న సంగతి స్పష్టం అవుతుంది. ప్రస్తుతం విద్యాభ్యాసం కోసం జమ్ము కశ్మీర్ (Jammu & Kashmir) లో ఉన్న చాలా మంది విద్యార్థులు భయంతో అలమటిస్తున్నారు. వారిలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు.
ఇదంతా గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కశ్మీర్ లో చదువుకుంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది. జమ్ము కశ్మీర్ లోని పలు కాలేజీల్లో ఏపీకి చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇప్పటివరకు పరిస్థితి నార్మల్ గా కొనసాగుతున్నా, ఇటీవల పాకిస్తాన్ ఆధారిత ఉగ్రదాడులు, పహల్‌గాం (Pahalgam) ఘటన, భారత వైమానిక దళాలు ఉగ్ర శిబిరాలపై చేసిన దాడులు కారణంగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడి విద్యార్థుల పరిస్థితిపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించిన టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) విద్యార్థుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ఈ బాధ్యతను నంద్యాల (Nandyal) ఎంపీగా ఉన్న టీడీపీ నేత బైరెడ్డి శబరి (Baireddy Shabari) కి అప్పగించారు. లోకేశ్ సూచనల మేరకు శబరి వెంటనే ఢిల్లీ (Delhi) వెళ్లి అక్కడ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న లవ్ అగర్వాల్ (Lav Agarwal) అనే సీనియర్ ఐఏఎస్ (IAS) అధికారికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కలసి సమన్వయం చేయాలని ఆమె ఆ లేఖలో కోరారు.
ఈ అంశంపై శుక్రవారం ఉదయం లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన కశ్మీర్ లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు అస్సలు ఆందోళన చెందవద్దని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థిని సురక్షితంగా తిరిగి రాష్ట్రానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ చర్యలు అన్ని శాఖల సమన్వయంతో వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.