Indian Army: కృష్ణా జిల్లా సముద్ర తీరంలో హై అలెర్ట్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటుగా పాకిస్తాన్ లో ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) లో భాగంగా భారత ఆర్మీ(Indian Army) దాడులు చేసిన నేపధ్యంలో యుద్ద వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా పాకిస్తాన్ దాడులకు దిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి నిఘా వర్గాలు. దీనితో సరిహద్దుల్లో భద్రతను కేంద్రం కట్టుదిట్టం చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను పెంచింది కేంద్రం. అటు భద్రతా బలగాలు సైతం.. సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మొహరించాయి. దేశ వ్యాప్తంగా 259 జిల్లాల్లో యుద్ధం ప్రభావం ఉంటుందని కేంద్ర హోం శాఖ అంచనా వేసింది.
అటు పారా మిలటరీ బలగాలకు సైతం సెలవలను రద్దు చేసారు. ప్రధాని నరేంద్ర మోడీ.. వరుస సమావేశాలు నిర్వహిస్తూ కీలక ఆదేశాలు ఇస్తున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాలపై కూడా యుద్ధం ప్రభావం పడే అవకాశం ఉందని కేంద్రం వెల్లడించింది. కేటగిరి 2 లో విశాఖ, హైదరాబాద్ లను చేర్చింది. ఈ తరుణంలో సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేసింది. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న నేపధ్యంలో.. మెరైన్ పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు కూడా భద్రతను పెంచాయి.
తాజాగా కృష్ణాజిల్లాలోని సముద్ర తీరంలో హైఅలర్ట్ ప్రకటించారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం… సముద్ర మార్గంలో ఉగ్రవాదులు జిల్లాలోకి రాకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. జిల్లాలో 110 కిలో మీటర్ల సముద్ర తీరం ఉండగా.. జిల్లా పరిధిలో 3 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. పాలకాయతిప్ప(కోడూరు మండలం), గిలకలదిండి(మచిలీపట్నం మండలం), ఒర్లగొందితిప్ప(కృత్తివెన్ను మండలం) మెరైన్ పీఎస్ పరిధిలో 150 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సముద్ర తీర గ్రామంలో మెరైన్ పోలీసులతో పాటు రెండు డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నారు. తీర గ్రామాల ప్రజలను సైతం మెరైన్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. మచిలీపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెరైన్ బోట్లు వినియోగంలో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.