Chandra Babu: సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుడుతున్న కూటమి ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) తాజాగా రాష్ట్ర ప్రజలందరికీ ఒక శుభవార్త అందించింది. ఎన్నో సంవత్సరాలుగా ప్రతిపాదనల స్థాయిలోనే ఉన్న సన్నబియ్యం (Sana biyyam) పంపిణీ పథకం ఇప్పుడు ఎట్టకేలకు అమలులోకి రానుంది. సన్నబియ్యాన్ని ప్రజలకు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పథకాన్ని రాబోయే జూన్ 12న ప్రారంభించబోతున్నారు. మొదటిగా రాష్ట్రంలోని పాఠశాలలు మరియు సంక్షేమ వసతి గృహాల్లో ఈ సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. దాదాపు 41,000 ప్రభుత్వ పాఠశాలలు మరియు 4,000 హాస్టళ్లకు ఈ బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు మంచి నాణ్యత కలిగిన బియ్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పోషక విలువలు అధికంగా ఉండే ఈ బియ్యం ద్వారా పిల్లల ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంది.
రేషన్ కార్డుదారుల (Ration card) విషయానికి వస్తే, పాఠశాలలు, హాస్టళ్ల తర్వాత వారి వరకు ఈ బియ్యం చేరనుంది. ఇందుకోసం అధికారులు అవసరమైన స్టాకును సిద్ధం చేస్తున్నారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీకి అవసరమైన టోకెన్లు, రికార్డులు ముందుగానే సిద్ధం చేస్తున్నారు. ఈ సన్నబియ్యం ప్రత్యేకతను పరిశీలిస్తే, ఇది తేలికగా జీర్ణమయ్యే రుచికరమైన బియ్యం. ఇందులో ఉండే పోషకాలు పిల్లలు, వృద్ధుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. రైతుల నుండి నేరుగా బియ్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించడంతో రైతులకు ఆర్థికంగా లాభం కలుగుతుంది. అలాగే రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కూడా అడ్డుకట్ట పడనుంది.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులు, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు, అలాగే కోట్లాది మంది రేషన్ కార్డుదారులకు లాభం కలగనుంది. ఇప్పటికే ప్రజలలో ఈ నిర్ణయం పట్ల మంచి స్పందన కనిపిస్తోంది. చాలామంది త్వరలో తామూ ఈ బియ్యం పొందాలనే ఉత్సాహంలో ఉన్నారు. ముఖ్యంగా మధ్య తరగతి, పేద కుటుంబాలు దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇటీవల ఒక సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మాట్లాడుతుంటే, మీడియా ప్రతినిధులు ఏపీలో ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందని ప్రశ్నించగా, ఆయన దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) పై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించడం, రేషన్ కార్డుదారులకు మంచి బియ్యం అందించడం వంటి నిర్ణయాలు ప్రభుత్వ బాధ్యతను చాటుతున్నాయని అంటున్నారు. గత వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో ఈ పథకం అమలుపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అదే టీడీపీ (TDP) కూటమి దీనిని అమలు చేయడంలో ముందుండడం ప్రజలకు కొత్త ఆశలను కలిగిస్తోంది.