NDA: ‘మా బంధం దృఢమైనది..’ క్లారిటీ ఇచ్చేసిన కూటమి పార్టీలు..!!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సఖ్యత మరింత బలపడినట్లు స్పష్టమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), టీడీపీ నేత నారా లోకేశ్‌లు (Nara Lokesh) ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ కూడా చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడారు. పరస్పర ప్రశంసలు కూటమి పార్టీల ఐక్యతను పటిష్ఠం చేశాయి. ప్రత్యర్థులకు వీళ్లను విడదీయడం అసాధ్యమనే భావన కలిగించాయి.
వెలగపూడి సమీపంలోని 250 ఎకరాల ప్రాంగణంలో జరిగిన అమరావతి పునఃప్రారంభోత్సవానికి లక్షలాది మంది హాజరయ్యారు. ప్రధాన వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆసీనులయ్యారు. చంద్రబాబు నాయకత్వాన్ని విజనరీగా కొనియాడుతూ ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు అమరావతి ప్రతీక. మోదీ రాకతో రాష్ట్రంలో నూతన ఆశలు చిగురించాయి అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. మోదీ కూడా చంద్రబాబు దూరదృష్టిని ప్రశంసిస్తూ అమరావతి పునర్నిర్మాణం రాష్ట్రానికి చరిత్రాత్మక మైలురాయి అని అన్నారు. మోదీ నాయకత్వంలో అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా రూపొందుతుందని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ పరస్పర ప్రశంసలు కూటమి పార్టీల మధ్య బలమైన బంధాన్ని సూచించాయి.
చంద్రబాబు ఎక్కడికెళ్లినా తానే టెక్నాలజీకి ఆద్యుడినని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో మాత్రం మోదీని టెక్నాలజీ ఆద్యుడిగా కొనియాడారు. అయితే మోదీ మాత్రం దీన్ని సున్నితంగా తోసిపుచ్చారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రినైన కొత్తలో చంద్రబాబు ఏం చేస్తున్నారనేదానిపై అధికారులతో అధ్యయనం చేయించేవాడినని.. అవి అమలు చేసేవాడినని చెప్పారు. టెక్నాలజీలో చంద్రబాబును మించిన వాళ్లు లేరన్నారు. అలాగే ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులను పట్టుకోవాలన్నా, వాటిని సత్వరమే కంప్లీట్ చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యమన్నారు. అది కూడా నాణ్యతతో పని చేయడం చంద్రబాబుకు అలావటని మోడీ ప్రశంసించారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు బలంపై ఆధారపడి ఉంది. అందుకే చంద్రబాబును మోదీ పొగిడారని భావిస్తున్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కోసమే మోదీపై చంద్రబాబు, పవన్, లోకేశ్ ప్రశంసలు కురిపించారని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఈ మూడు పార్టీల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని స్పష్టంగా ఆర్థమైంది. ఇటు రాష్ట్రానికి, అటు కేంద్రానికి వీళ్ల బలం కచ్చితంగా మేలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మూడు పార్టీలు మధ్య గ్యాప్ వచ్చి విడిపోతే తమకు మేలు జరుగుతుందని వైసీపీ ఆశిస్తోంది. అయితే రోజురోజుకూ వీళ్ల బలం పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. కాబట్టి ఇది కచ్చితంగా వైసీపీ జీర్ణించుకోలేని అంశమే.