ప్రతిపక్ష హోదా లేకపోతే ఆయన రారు.. ఉన్నా ఈయన రారు.. ఇద్దరు బాగా సెట్ అయ్యారు..

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ప్రధానంగా చర్చించుకుంటున్న అంశం ప్రతిపక్ష హోదా. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ గల్లీలలో ధర్నా చేస్తున్నారు. మరోపక్క ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ అసెంబ్లీలకు వెళ్ళనని కేసీఆర్ మొరాయించుకొని కూర్చొని ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఇద్దరి ఉద్దేశం ఏమిటి అనే విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రతిపక్షానికి ఉన్న పవర్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు అధికార పక్షాలను సైతం ప్రశ్నించి.. మరసటి ఎన్నికల్లో విజయం సాధించిన విపక్షాలు ఉండేవి. అంతెందుకు మొన్నటి వరకు చంద్రబాబు ప్రతిపక్ష నేతగానే ఉన్నారు కదా. సభలో తనకు జరిగిన అవమానంతో బాధపడ్డా ఆయన కౌరవసభను గౌరవ సభగా చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చారు. అలాగే ప్రజల మధ్యకు వెళ్లారు.. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగట్టారు.. అందుకే ఈసారి ఎన్నికల్లో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
గత ఏడాది చివర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. కెసిఆర్ ప్రధాన ప్రతిపక్షానికి పరిమితమయ్యాడు. అయినప్పటికీ అసెంబ్లీ సమావేశాలకి కెసిఆర్ హాజరు కావడం లేదు. మరొక రేవంత్ రెడ్డి పదేపదే ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలంటూ తన ప్రతి ప్రసంగంలోనూ ప్రస్తావిస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన టైం లో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొక్కుబడి ప్రాయంగా 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉంటేనే అసెంబ్లీలో మాట్లాడడం కుదురుతుంది అని జగన్ వాదిస్తున్నారు. అంతేకాదు తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇప్పించాల్సిందిగా కోర్టును కూడా ఆశ్రయించారు. ఇక జగన్ ఆశించినట్లు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం అయితే కనిపించడం లేదు. అంటే మొత్తానికి జగన్ ఇక అసెంబ్లీకి వచ్చే అవకాశం లేనట్టే. దీంతో హోదా ఉన్న లేకున్నా.. సభకు మాత్రం రాని పాలకులుగా ఇటు జగన్, అటు కేసీఆర్ హాట్ టాపిక్ గా మారుతున్నారు.